ఈ విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి

by Naveena |

హైదరాబాద్ నగరాన్ని మరో సిలికాన్ వ్యాలీలా తయారు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరాన్ని మరో సిలికాన్ వ్యాలీలా తయారు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హెచ్ ఐసీసీలో ఆదివారం సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ యాన్వల్ సెలబ్రేషన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సైబరాబాద్ బిల్డర్ అసోసియేషన్ మొదటి జనరల్ బాడీ సమావేశానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్, కన్స్ట్రక్షన్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బిల్డర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, హైదరాబాద్ నగర అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. ఇకపై కూడా నగరంలో మౌళిక వసతుల కల్పనతో పాటు అన్ని రంగాల అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణా గోదావరి జలాలను నగరానికి తీసుకువచ్చిన ఘనత తమదేనని ఉత్తమ్ అన్నారు. ప్రజల రవాణా సౌకర్యార్ధం మెట్రో రెండో దశ పనులను మొదలు పెట్టనున్నట్టు వెల్లడించారు. పెట్టుబడులకు అనుకూలంగా ఫ్యూచర్ సిటీని తీసుకురావడంతో పాటు మూసీ పునర్వవ్యవస్థీకరణ చేస్తున్నట్లు తెలిపారు. బిల్డర్స్ అందరికీ భరోసా కల్పిస్తున్నామని, నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు. ఉదయ్ శేఖర్ తో పాటు సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story