ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు.. సీరియల్ దొంగ అరెస్ట్

by Kodari Anjali |

ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ఓ సీరియల్ దొంగను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు.. సీరియల్ దొంగ అరెస్ట్
X

దిశ, సికింద్రాబాద్: ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ఓ సీరియల్ దొంగను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి నగదుతో పాటు మరో చోరీ కేసుకు సంబంధించిన బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. బీడల్‌బస్తీ ఎదురుగా ఉన్న విమల గురురాజ్ రెసిడెన్సీలో నివాసముంటున్న బబ్బూర్ శివగౌడ్ (33) ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 327/2026 కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 5న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన ఆయన, జూలై 6న తిరిగి వచ్చి చూడగా ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని రూ.15 వేల నగదు, ఒక జత బంగారు చెవిపోగులు, ఒక బంగారు గొలుసు చోరీకి గురైనట్లు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎం.కే.నగర్‌కు చెందిన తమ్మిశెట్టి రాజు (25) అనే కూలీని అదుపులోకి తీసుకుని విచారించారు.

మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం..

విచారణలో చిలకలగూడతో పాటు వరసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా ఇంటి చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాల్లో ఎక్కువ భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించగా, వచ్చిన డబ్బును వ్యక్తిగత ఖర్చులు, అప్పులు తీర్చేందుకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుత కేసుకు సంబంధించిన రూ.1,000 నగదును స్వాధీనం చేసుకోగా, నిందితుడి వద్ద లభించిన రెండు బంగారు ఉంగరాలు వరసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో చోరీ కేసుకు సంబంధించినవిగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడి ప్రమేయం ఉన్న ఇతర కేసులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చిలకలగూడ ఎస్‌హెచ్‌వో వి. రామకృష్ణ ప్రజలకు పలు సూచనలు చేస్తూ, ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు తాళాలు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్–100/112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Next Story