కుటుంబాన్ని మోసం చేసిన కుమారుడు

by Ratna Kumari |

కుటుంబ విశ్వాసాన్ని తాక‌ట్టు పెట్టి త‌ల్లి, చెల్లెలు కి సంబంధించిన బంగారు ఆభ‌ర‌ణాల‌ను కుమారుడు దొంగిలించిన ఘ‌ట‌న కాంచ‌న్ బాగ్ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది.

కుటుంబాన్ని మోసం చేసిన కుమారుడు
X

దిశ‌, చంపాపేట్‌ : కుటుంబ విశ్వాసాన్ని తాక‌ట్టు పెట్టి త‌ల్లి, చెల్లెలు కి సంబంధించిన బంగారు ఆభ‌ర‌ణాల‌ను కుమారుడు దొంగిలించిన ఘ‌ట‌న కాంచ‌న్ బాగ్ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. ఈ సంచ‌ల‌న కేసును పోలీసులు వేగంగా ఛేదించి.. ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. కాంచ‌న్ బాగ్ పోలీస్ స్టేష‌న్ కి చెందిన మొహ‌మ్మ‌ద్ ర‌హ్మ‌త్ ష‌రీఫ్ ఫిర్యాదు మేర‌కు జ‌న‌వ‌రి 17న త‌న భార్య‌, కుమార్తె ఆభ‌ర‌ణాల‌ను ఇంటి అల్మ‌రాలో భ‌ద్ర ప‌రిచారు. అయితే మార్చి 29న ప‌రిశీలించ‌గా.. అవి క‌నిపించ‌కుండా పోయాయి. దీంతో అనుమాన‌స్ప‌ద ప‌రిస్థితిలో పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసుల ద‌ర్యాప్తులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.


ఫిర్యాదు దారుడి కుమారుడు మొహమ్మద్ అద్నాన్ షరీఫ్ (19) కుటుంబ సభ్యులు ధరించిన బంగారాన్ని గమనించి దొంగతనానికి పథకం రచించాడు. ఆపై తన స్నేహితులు రేహాన్ ఉద్దీన్ (25), సమీర్ (22) సహకారంతో పలు సార్లు ఇంట్లోనే బంగారం దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఆర్థిక ఇబ్బందులు, విలాసవంతమైన జీవనశైలి కోరికలే ఈ నేరానికి కారణమని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 2న నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 137 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక వేర్నా కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా.. వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో ఏసీపీ చాంద్రాయణగుట్ట డివిజన్ ఏ. సుధాకర్ పర్యవేక్షణలో, కంచన్‌బాగ్ ఎస్హెచ్ఓ వై. కమల్ కుమార్, ఎస్ఐ కె. రాజు, క్రైమ్ స్టాఫ్ కీలక పాత్ర పోషించారు.

Next Story