సమస్యలు ఇక్కడ....అధికారులు ఎక్కడ..?

by Elthuri vijay kumar |

ఇక్కడ సమస్యలతో తాము ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఎక్కడ ఉన్నారని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు ఇక్కడ....అధికారులు ఎక్కడ..?
X

సమస్యలు ఇక్కడ....అధికారులు ఎక్కడ..?

నీట మునిగిన కుటుంబాలు.. పట్టించుకొని అధికారులు.

బాధితులకు న్యాయం చేసిది ఎవరూ..?

జిహెచ్ఎంసి అధికారులు పారిశుద్ధ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు: మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత.

దిశ,సికింద్రాబాద్: ఇక్కడ సమస్యలతో తాము ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఎక్కడ ఉన్నారని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నబుధవారం రాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని బౌద్ధనగర్, మెట్టుగూడా డివిజన్ లో చాలా ఇళ్లు నీట మునిగాయి. నిత్యవసర వస్తువులు, కట్టుకునే దుస్తులు, సామాగ్రి పూర్తిగా వరద నీటిలో కలిసిపోయాయి. ఒక్కసారిగా వారి జీవనం చెల్లా చెదురు అయిపోయింది. గురువారం వరకు ఇంట్లోకి చేరిన బురద నీటిలోనే బిక్కు బిక్కు మంటూ గడపాల్సి వచ్చింది. మెట్టుగూడా కార్పొరేటర్ వచ్చి తమను పరామర్శించి, మరుసటి రోజు కొంత నిత్యవసర వస్తువులు అందించారని మెట్టుగూడా లోని వరద బాధితులు పలువురు చెప్పారు. జీహెచ్ఎంసి,జలమండలి అధికారులు ఒక్కరూ కూడా రాలేదన్నారు. హైడ్రా సిబ్బంది వచ్చి రోడ్డు మీద చెత్తను తొలగించారని తమను మాత్రం పట్టించుకున్న నాధుడే లేడన్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించడానికి ఒకరోజు సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నీట మునిగిన కుటుంబాలు, పట్టించుకొని అధికారులు...

బుధవారం రాత్రి కురిసిన వర్షానికి బౌద్ధబగర్, మెట్టుగూడా డివిజన్ లో సుమారు 300కు పైగా కుటుంబాలు నీటి మునిగాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరుకొని ఇంట్లోని సామాగ్రి నీటిలో కొట్టుకుపోయాయి. ఎవరికి ఫోన్ చేసిన స్పందించలేదని, ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన వారు లేరన్నారు. అధికారులు,పాలకులు, ప్రతిపక్షాలు ఎవరు పట్టించుకోలేదన్నారు. కుటుంబాలు రోడ్డున పడ్డాకా మాత్రం ప్రతిపక్ష నాయకులం అని చెప్పుకొనే కొందరు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి పోయాయి తప్ప తమకేమీ చేయలేదన్నారు. తమను పట్టించుకొని వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎవరు వచ్చిన వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

బాధితులకు న్యాయం చేసిది ఎవరూ..?

నష్ట పోయిన తమకు న్యాయం చేసేది ఎవరని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ10వేలు, నిత్యావసర వస్తువులు అందించారని గుర్తు చేశారు. స్తానిక ఎమ్మెల్యే పద్మారావు ఇంతవరకు తమని వచ్చి పరామర్శించింది లేదన్నారు. కొందరు వ్యక్తులు వచ్చి తమ ఆధార్ కార్డు, బ్యాక్ పాస్ బుక్ జిరాక కాఫీలు తీసుకున్నారని చెప్పారు. వరదలో కొన్ని కుటుంబాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి, అందులో కొందరు ఒంటరి మహిళలు ఉన్నారు. అలాంటి వారికైనా న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

పారిశుద్యాన్ని గాలికి వదిలేసిన జిహెచ్ఎంసి అధికారులు: మెట్టుగూడా కార్పొరేటర్ రాసురీ సునీత

జిహెచ్ఎంసి అధికారులు పారిశుధ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసారని మెట్టు కూడా డివిజన్ కార్పొరేటర్ రాసురీ సునీత అగ్రహారం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల తీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బారి వరదలో తమ డివిజన్ పరిధిలోని చాలా కుటుంబాలు ఆగం అయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అర్థరాత్రి నుండి వర్షంలో తిరుగుతూ బాధిత కుటుంబాలని పరామర్శించారు. మరుసటి రోజు ఉదయం నుండి అధికారులకు ఫోన్ చేసిన సరియైన స్పందన లేదన్నారు. హైడ్రా అధికారులకు కాల్ చేస్తే జిహెచ్ఎంసి అధికారులకు చెప్పండని, జిహెచ్ఎంసి అధికారులకు కాల్ చేస్తే జలమండలి అధికారులకు చెప్పండి అంటూ సమాధానం ఇచ్చారని తెలిపారు. సమస్యలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అధికారులు తప్పించుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. తమ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ఇలా లేదన్నారు. కార్పోరేట్ గా కాల్ చేస్తే తనకే సరిగా స్పందించని అధికారులు, ప్రజలకు ఎంత వరకు స్పందిస్తారనేది అర్దం అవుతుందన్నారు. అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తూ ప్రజా పాలన పేరుతో గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలన్నారు.

Next Story