డబుల్ బెడ్ రూం కోసం పేదోడికి తప్పని ఎదురుచూపులు

by Malleboina Mahesh |

పేదలకు సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుంది. ఎన్నికలప్పుడు నాయకులు ఇచ్చే హామీలతో ఇక తాము నివాసం ఉండేందుకు ఇల్లు ఉంటుందని ఆశపడిన వారికి నిరాశే మిగులుతుంది.

డబుల్ బెడ్ రూం కోసం పేదోడికి తప్పని ఎదురుచూపులు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: పేదలకు సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుంది. ఎన్నికలప్పుడు నాయకులు ఇచ్చే హామీలతో ఇక తాము నివాసం ఉండేందుకు ఇల్లు ఉంటుందని ఆశపడిన వారికి నిరాశే మిగులుతుంది. అర్జీలు పట్టుకొని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం మాత్రం ఉండటం లేదు. దీంతో తాము సొంత ఇంట్లో ఉంటామన్న ఆశ కలగానే ఉండిపోతుంది. ఇలా గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం లక్షలాది మంది పేదలు ఎదురు చూస్తున్నారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నా..

హైదరాబాద్ వంటి మహానగరంలో పేదోడి సొంతింటి కల నెరవేరడం అంత సులువు కాదు. లక్షలాది రూపాయలు వెచ్చిస్తే తప్ప సొంతిల్లు కొనుగోలు చేయలేరు. వారికి పూట గడవడం కష్టంగా మారగా.. ఇక ఇల్లు కొనే పరిస్థితే లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అర్హులైన పేదలకు లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు లొకేషన్లలో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టింది. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి చేసుకోగా పేదలకు పంపిణీ చేశారు. ఇంకా చాలా చోట్ల నిర్మాణం పూర్తి కాగా పంపిణీ చేయకుండా నిలిపివేశారు. మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లు వేలల్లో ఉండగా.. అర్జీదారులు లక్షల్లో ఉండడంతో ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు.

దీంతో వాటిని ఎవరికీ పంపిణీ చేయకుండా నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటి వరకు సొంతిళ్లు వస్తాయనే నమ్మకం తో ఉన్న వారిలో రోజులు గడుస్తున్నా కేటాయింపులు జరగకపోవడంతో ఆ నమ్మకం క్రమంగా సన్నగిల్లుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను అర్హులైన పేదలకు అందిస్తామని ప్రకటన చేశారు. ఈ మేరకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇంచార్జి మంత్రి చైర్మన్ గా, కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. అయితే ఈ ఇండ్లు కొంతమంది లబ్ధిదారులకు అందడం తో మిగిలిన వారు దరఖాస్తులు పట్టుకొని కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

తలనొప్పిగా వ్యవహారం..

గ్రేటర్ ఎమ్మెల్యేలకు డబుల్ బెడ్ రూం నివాసాలు తలనొప్పిని కట్టిస్తున్నాయి. కార్యాలయంలో ఉన్నా, బస్తీలకు వెళ్లినా వీటి గురించే అడుగుతుండడంతో ప్రజలకు నచ్చచెప్పలేక వారు తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది తమకు ఉన్న పలుకుబడి ని ఉపయోగించి ఇతర ప్రజాప్రతినిధులతో సిఫారసు లెటర్లు తీసుకొస్తున్నారు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే తమకు బాగా తెలుసని కొంతమంది, బంధువని మరికొంత మంది ఇండ్ల కోసం తంటాలు పడుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం వచ్చే వారి అనుమానాలను నివృత్తి చేస్తూ త్వరలో అందుతాయని నచ్చజెప్పి పంపిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నది. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్లు మరోమారు పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తున్నాయి.

ప్రజావాణిలో పోటెత్తిన దరఖాస్తుదారులు..

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించే పెద్ద సంఖ్యలో అర్జీలు అందుతున్నాయి. వచ్చే పిటీషన్లలో సింహ భాగం డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించే ఉంటుండగా.. అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ప్రతివారం ఒకే పేరుతో దరఖాస్తులు వస్తుండడంతో రిపీటెడ్‌గా అర్జీలు అవసరం లేదని అధికారులు సూచిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. ఇలా ప్రజావాణికి వచ్చే అర్జీలు చూస్తేనే గ్రేటర్ ప్రజలు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎంతగా ఆరాట పడుతున్నారో తెలిసి పోతుంది. తమ సొంతింటి కల నెరవేరుతుంది, లేదోనని పేదలు ఎదురు చూస్తున్నారు. త్వరలో బల్దియా ఎన్నికలు ఉండడంతో మరోసారి డబుల్ బెడ్ రూం ఇండ్లు హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story