- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో రెచ్చిపోతున్న నయా మాఫియా.. ఖాళీ స్థలం కనిపిస్తే డబ్బా పెట్టాల్సిందే
హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా కొత్త రకం దోపిడీ మొదలైంది. నయా పైసా ఖర్చు లేదు. చెమటోడాల్సిన పని అంతకన్నా లేదు. జస్ట్ బైక్ పై, లేదంటే కారులో గల్లీలో చక్కర్లు కొడుతూ.. జీహెచ్ఎంసీ ఆఫీసు దగ్గర, తహశీల్దార్ కార్యాలయం వద్ద తరచుగా కనిపిస్తే చాలు.. ఇక అప్పుడప్పడు కార్పొరేటర్ల దగ్గర, నాయకులు వచ్చినప్పుడు హడావిడి చేస్తే ఇక వారి ఆగడాలకు అంతే ఉండదు.

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా కొత్త రకం దోపిడీ మొదలైంది. నయా పైసా ఖర్చు లేదు. చెమటోడాల్సిన పని అంతకన్నా లేదు. జస్ట్ బైక్ పై, లేదంటే కారులో గల్లీలో చక్కర్లు కొడుతూ.. జీహెచ్ఎంసీ ఆఫీసు దగ్గర, తహశీల్దార్ కార్యాలయం వద్ద తరచుగా కనిపిస్తే చాలు.. ఇక అప్పుడప్పడు కార్పొరేటర్ల దగ్గర, నాయకులు వచ్చినప్పుడు హడావిడి చేస్తే ఇక వారి ఆగడాలకు అంతే ఉండదు. ఎంచక్కా జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాలు, మెయిన్ రోడ్ల పక్కనే ఉన్న జాగాలు, గల్లీల్లో హాస్టళ్ల ముందు ఏమాత్రం జాగా ఉన్నా అక్కడ డబ్బాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చీ బండ్లు.. ఇలా ఒకటేమిటి వారికి ఏది నచ్చితే అది చేసేయొచ్చు. అడిగే వారే ఉండరు. ఇప్పుడు ఈ తరహా ముఠాలు ఓ మాఫియాలాగా మారి నగరంలో హల్ చల్ చేస్తున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
అన్ని చోట్లా ఆక్రమణలే..
నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపైనే విచ్చలవిడిగా దుకాణాలు వెలుస్తున్నాయి. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్ ఇలా ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు నగర రోడ్లతో పాటు ఆ పక్కనే ఉన్న ఫుట్ పాత్ లు, ఖాళీ స్థలాలు, జీహెచ్ఎంసీ ఓపెన్ ల్యాండ్స్ అన్నీ కిటకిటలాడుతూ కనిపిస్తాయి. పాదచారుల కోసం వేసిన ఫుట్ పాత్ లు టిఫిన్ సెంటర్లకు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలకు అడ్డాగా మారాయి అంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై వెలుస్తున్న ఈ దుకాణాలతో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి. సర్వీస్ రోడ్లలో కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. అదేంటి అంటే వాహనదారులపై దుకాణదారులు దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేస్తున్నారు.
మాకిచ్చుకోండి.. మీరు నడుపుకోండి..
ఇంకొన్ని చోట్ల ఖాళీ స్థలాలను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. పొట్టకూటి కోసం చిన్న చిన్న టిఫిన్ సెంటర్లను నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారి వద్ద బాజాప్త డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఈ స్థలం మాది.. మాకు ఏ రోజుకు ఆరోజు కప్పం కట్టకుంటే ఖాళీ చేయిస్తాం.. మీరు ఇక్కడ ఏ దందా చేయకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మాఫియా ఆగడాలు శృతి మించిపోతున్నాయనే చెప్పాలి. రాత్రి 10 గంటల తర్వాత ఈ ముఠా రోడ్డు పక్కన బండ్లు పెట్టుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. వీరే గాక పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు సైతం నెలనెలా మామూళ్లకు పాల్పడడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది.
ఆ ఏరియాల్లో ఫుల్ డిమాండ్..
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, హైదర్ నగర్, కేపీహెచ్ బీ లాంటి ప్రాంతాల్లో రోడ్లపై విచ్చలవిడిగా దుకాణాలు వెలిశాయి. సాయంత్రం అయితే చాలు.. అడుగు తీసి అడుగు వేయడం కూడా గగనం అవుతుంది. ఆయా ప్రాంతాల్లో కొందరు చిరు వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వకుంటే బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అటు జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాలను కూడా ఈ ముఠా తమ గుప్పిట్లో పెట్టుకొని రోజుకు ఇంత అని వసూళ్లు చేసి పబ్బం గడుపుకుంటుందని తెలుస్తుంది. ఇకపోతే తమ షాపుల ముందున్న ఖాళీ స్థలాలను కూడా లీజ్ కు ఇచ్చి ఇంకొంత మంది వ్యాపారులు ట్రాఫిక్ రద్దీకి కారణం అవుతున్నారు. ఇలాంటి వారిపై అటు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.






