ఫ్యూచర్‌ భారత్.. సేఫ్ నగరంగా ఫోర్త్ సిటీ

by Javid Pasha |

‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ‘ఫోర్త్ సిటీ’లో కొత్తగా పోలీస్ మిషనరేట్‌ను ఏర్పాటు చేసింది.

ఫ్యూచర్‌ భారత్.. సేఫ్ నగరంగా ఫోర్త్ సిటీ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ఏదైనా ప్రాంతంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయి. పెట్టుబడులు సైతం అదే స్థాయిలో వస్తాయి. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజానీకం కూడా ఆసక్తి చూపిస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కొత్తగా నిర్మించబోతున్న నాలుగో నగరం ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ‘ఫోర్త్ సిటీ’లో కొత్తగా పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని వర్గాలకు అభయం ఏర్పడింది. అలాగే..బలోపేతం కానున్న భద్రతా వ్యవస్థతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

నాలుగో నగరంగా ఫ్యూచర్‌ సిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. అది ఎలా ఉంటుందోనని మొదట్లో అన్ని వర్గాలు వేచి చూసే ధోరణిలో ఉండిపోయాయి. గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహించి ప్రభుత్వం విజన్‌ 2047 డాక్యుమెంట్‌ను ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. కానీ..శాంతి భద్రతల విషయంలోనే అందరికీ అనుమానాలు. అందుకే ఫ్యూచర్‌ సిటీ ప్రాంతంలో శాంతిభద్రతలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’లో పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో అభివృద్ది కార్యకలాపాలు ముమ్మరం కానుండడంతో పోలీసుల పర్యవేక్షణ కూడా పెరగాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసి అన్నివర్గాలకు అభయం ఇచ్చింది. దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్‌ ఉంటుండగా.. ఫ్యూచర్‌ సిటీని సైతం శాంతి సుస్థిరతలకు చిరునామాగా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది.

ఎన్నో సానుకూలతలు..

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెడుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ట్రిపుల్‌ ఆర్‌కు మధ్యన 30 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీకి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ది కోసం 7 మండలాలు, 56 గ్రామాలతో ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే స్కిల్‌ యూనివర్శిటీ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కృత్రిమ మేధ నగరంతోపాటు ఎడ్యుకేషన్‌, హెల్త్ హబ్‌లు, కాలుష్య రహిత ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలతో ఫ్యూచర్‌ సిటీకి రవాణా కనెక్టివిటీ కల్పించేందుకు 300 అడుగుల గ్రీన్‌ ఫీల్డ్​ రోడ్డును ప్రభుత్వం చేపడుతోంది. ఫోర్త్ సిటీకి చేరుకునేలా అనేక రేడియల్‌ రోడ్లు రానున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వద్ద నిర్మాణంలో ఉన్న స్కిల్‌ యూనివర్శిటీ వరకు మెట్రో కారిడార్‌ డీపీఆర్‌ తయారీ కోసం సర్వే పనులు చకచకా సాగుతున్నాయి. ఫోర్త్ సిటీ నుంచి ఏపీలోని మచిలీపట్నానికి గ్రీన్‌ ఫీల్డ్​ ఎక్స్​​ ప్రెస్ హైవేను నిర్మించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ ప్రాంతం మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ను తెచ్చే ప్రతిపాదన సైతం ఉంది. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఫ్యూచర్‌ సిటీ ప్రాంతం చేరువలో ఉండడం ప్రధాన సానుకూలతల్లో ఒకటి. ప్రణాళికలన్నింటిని ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది.

ప్రైవసీ, సెక్యూరిటీ..

శ్రీశైలం హైవేకు పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అద్భుతంగా సాగుతున్నది. ఖరీదైన విల్లాలకు ఈ ప్రాంతం హాట్‌ స్పాట్‌గా మారింది. ముఖ్యంగా తుక్కుగూడ మొదలు ఓఆర్‌ఆర్‌, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్‌, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో విల్లాలకు డిమాండ్‌ పెరిగింది. కొత్త కొత్త వెంచర్లతో పలు నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. విల్లాలు, అపార్ట్‌మెంట్లను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వందలాదిగా ఏర్పాటుకాగా..ఇంకా పెద్దఎత్తున నిర్మితమవుతున్నాయి. శ్రీశైలం హైవే, చేరువలో విమానాశ్రయం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ప్రాంతీయ వలయ రహదారి, మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలతో మున్ముందు ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా ఈ ప్రాంతాలు మారనుండడంతో చాలా మంది ఇటువైపుగా మొగ్గు చూపుతున్నారు. కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో బడా సంస్థలు వందల ఎకరాల్లో విల్లాలు, లే అవుట్లు, రిసార్టులను చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వీటికితోడు 9 లక్షల జనాభా కోసం నివాస గృహాల సముదాయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. దీంతో ఈ ప్రాంతం రాబోవు రోజుల్లో మహానగరాన్ని తలపించనున్నది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, ఆమన్‌గల్‌ తదితర ప్రాంతాలతో ఫ్యూచర్‌ సిటీలో పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రైవసీ, సెక్యూరిటీని కోరుకుంటున్న వారికి పెట్టుబడులు పెట్టేందుకు ఈ ప్రాంతం అనుకూలమనే భావన కలుగుతోంది.

Next Story