అంతా ‘ఆయన’ కనుసన్నల్లోనే.. సరూర్‌నగర్ సర్కిల్‌లో అసెస్‌మెంట్ల బాగోతం

by Ajay Maddhiboyina |

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్ సర్కిల్‌లో అసెస్‌మెంట్ల మాయాజాలం మూడుపువ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. రెవెన్యూ విభాగంలో పనిచేసే ఇంచార్జి ఏఎంసీ అన్నీ తానై లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అంతా ‘ఆయన’ కనుసన్నల్లోనే.. సరూర్‌నగర్ సర్కిల్‌లో అసెస్‌మెంట్ల బాగోతం
X

దిశ, చైతన్యపురి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్ సర్కిల్‌లో అసెస్‌మెంట్ల మాయాజాలం మూడుపువ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. రెవెన్యూ విభాగంలో పనిచేసే ఇంచార్జి ఏఎంసీ అన్నీ తానై లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అసలేం జరుగుతుంది..

సరూర్ నగర్ సర్కిల్ 12లో గడ్డి అన్నారం డివిజన్‌లోని దిల్‌సుఖ్ నగర్ పూర్తిగా వ్యాపార సముదాయంగా ఆవిర్భవించింది. ఒకప్పుడు గడ్డి అన్నారం డివిజన్ పూర్తిగా రెసిడెన్షియల్ జోన్. కాలక్రమేణా ఈ ఏరియా మొత్తం కమర్షియల్‌గా అవతరించింది. సగం దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం మొత్తం ఈ డివిజన్ పరిధిలో ఉండడంతో ఇక్కడ ఉన్న నివాసాలు మొత్తం వ్యాపార కేంద్రాలుగా మారాయి. యజమానులు దాదాపుగా పాత నివాసాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టి హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్, వస్త్ర దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏర్పాటు కోసం బహుళ అంతస్తులు నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ కేవలం టౌన్ ప్లానింగ్ ద్వారా స్టిల్ట్ ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలకు అనుమతి లభిస్తుంది. కానీ యజమానులు మాత్రం స్టిల్ట్ ప్లస్ 4 అంతస్తులు చేపట్టి అక్క్యూపెన్సీ సర్టిఫికెట్లు దొడ్డిదారిన పొందుతున్నారు. ఇదే కాకుండా స్టిల్ట్ ప్లస్ 4 అనుమతులు నిర్మాణం చేసి పైన రేకుల షెడ్డు ద్వారా మరో అంతస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ జరుగుతున్నా తంతు ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి.

అసెస్ మెంట్ మాయాజాలం..

రెవెన్యూ విభాగంలో ఇంచార్జి ఏఎంసీ స్థానంలో కూర్చున్న బాబురావు తన కనుసన్నల్లో అసెస్ మెంట్లు తప్పులతడకగా చేస్తూ లక్షలాది రూపాయలు మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఈయన కనుసన్నల్లో పనిచేసే టాక్స్ ఇన్ స్పెక్టర్లు సైతం ఈయన మాట జావదాటరు. బిల్ కలెక్టర్లు అంటే లెక్కలేదు. నచ్చినవారికి బంగారు పల్లెం, నచ్చనివారికి ఇస్తరాకు వేసి వడ్డించడం బాబురావుకు వెన్నతో పెట్టిన విద్య. తాను చెప్పినట్లు చేయకపోతే అంతేసంగతులు. చిత్తగించవలెను అనే మాట గుర్తు చేసుకోవాలి. గతంలో గ్రూప్ 4 లో ఉద్యోగం సాధించి బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నరేందర్ ఈయన బాధ వేధింపులు భరించలేక ఆరు నెలల క్రితం కొత్తగా ఏర్పడిన నాగోల్ సర్కిల్ కు బదిలీ చేసుకున్నాడు. ఇది అక్షరాల సత్యం. కారణం ఏమిటంటే ఒక భవనానికి అసెస్ మెంట్ పెంచాలని ఫైల్ పెట్టగా.. అతనిపై కక్ష పెంచుకున్నాడు. వేధింపులకు దిగాడు. తట్టుకోలేక బదిలీ పెట్టుకొని వెళ్లిపోయాడు. ప్రతి ఒక్కరినీ ఇలాగే టార్చర్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా.. ఎక్కడెక్కడ ఎన్ని భవనాలకు తక్కువ అసెస్ మెంట్లు చేస్తున్నారోనన్న విషయం పూర్తి ఆధారాలతో రేపు మరో కథనం. బాబురావుపై వరుస కథనాలతో దిశ పత్రికలో ప్రచురిస్తాం.

Next Story