- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్లు లేకుండా చేయడమే లక్ష్యం: రమేష్ పట్నాయక్
దేశంలో రిజర్వేషన్లను లేకుండా చేయడమే నూతన జాతీయ విద్యా విధాన లక్ష్యమని ఆలిండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రెసిడియం మెంబెర్ రమేష్ పట్నాయక్ పేర్కొన్నారు.

దిశ, సికింద్రాబాద్: దేశంలో రిజర్వేషన్లను లేకుండా చేయడమే నూతన జాతీయ విద్యా విధాన లక్ష్యమని ఆలిండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రెసిడియం మెంబెర్ రమేష్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో మంళవారం నూతన జాతీయ విద్యా విధానం2020 పర్యవసానాలు అనే అంశంపై కన్వీనర్ డాక్టర్ కే.రజిని, కో కన్వీన సత్య నెల్లి అధ్యక్షతన ఓయూ లో సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి రమేష్ పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో స్వతంత్రానంతరం 1968, 1986లో జాతీయ విద్యా విధానాల రూపకల్పన జరిగినపుడు పార్లమెంటులో విస్తృతమైన చర్చ జరిగిందని తెలిపారు.
2020 లో తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పై నియమించిన సుబ్రహ్మణ్యం కమిషన్, కస్తూరి రంగన్ కమిషన్ సిఫారసులపై పార్లమెంట్ లో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదింప చేసి, దానిని ప్రజల పైన బలవంతంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానం విద్యను కేంద్రీకరణ చేస్తూ కార్పొరేటీకరణకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం విద్యను కల్పించాల్సిన బాధ్యతను మెల్లమెల్లగా తప్పించుకొని విద్యను కార్పొరేట్ శక్తులకు అందించే కుట్ర దాగి ఉందన్నారు. దీనివల్ల బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీలు నాణ్యమైన ప్రాథమిక విద్యకు దూరం అవుతారని చెప్పారు. ఈ విద్యావిధానం వల్ల యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయని తెలిపారు. ఒక కాలానికి, ఒక స్థలానికి, ఒక వర్గానికి చెందిన సంస్కృతిని భారతీయ సంస్కృతిగా పేర్కొంటూ 90 శాతం ప్రజలకు సంబంధం లేని ఆధిపత్య సంస్కృతి, మనువాద సంస్కృతిని విభిన్న సంస్కృతులకు చెందిన మెజారిటీ ప్రజల పైన బలవంతంగా రుద్దడానికి మార్గం సుగమం చేస్తుందని తెలిపారు.
ఒకవైపు భారతీయ సమాజాన్ని కులాల పేరిట, మతాల పేరిట, జాతుల పేరిట, తెగల పేరిట, విభజిస్తూ భారతీయ సంస్కృతి అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల వాదులు, విద్యార్థులు, మేధావులు ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరం నాయకులు బోస్, జంధ్యాల కల్పన, డాక్టర్ సోమ సుందర్ మర్ల, డాక్టర్ సి నారాయణ రావు, స్టాలిన్, నారాయణ, గ్యార నరేష్, ఉప్పల ఉదయ్ కుమార్, ఇ బాలరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.






