హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత

by Taduka Kalyani |

కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 27 లోని 400 ఎకరాల భూముల వేలాన్ని ఆపాలంటూ హెచ్ సీయూ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత
X

దిశ, శేరిలింగంపల్లి : కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 27 లోని 400 ఎకరాల భూముల వేలాన్ని ఆపాలంటూ హెచ్ సీయూ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కొన్ని గుంట నక్కలు చేరాయని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీనిపై హెచ్ సీయూ విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. రాత్రి నుండి యూనివర్సిటీ లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఆదివారం ఉదయం విద్యార్థులు మరోసారి తమ నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా విద్యార్థులు ముందుకు సాగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని విద్యార్థులు ఆరోపించారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని, ఇక్కడ అనేక జీవజాతులు, వృక్ష సంపద, వైవిధ్యమైన రాళ్లు ఉన్నాయని అన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన గచ్చిబౌలి సీఐ, ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తరఫు న్యాయవాదులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Next Story