అఖిల్ హ‌త్య కేసులో ఉద్రిక్త‌త

by Ratna Kumari |

హత్యకు గురైన అఖిల్ తండ్రి శ్రీనివాస్‌తో పాటు బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున నిందితుల ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.

అఖిల్ హ‌త్య కేసులో ఉద్రిక్త‌త
X

దిశ‌, సీతాఫ‌ల‌మండి : హత్యకు గురైన అఖిల్ తండ్రి శ్రీనివాస్‌తో పాటు బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున నిందితుల ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ కుమారుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. “మా బిడ్డ ప్రాణం తీసిన నిందితులు దర్జాగా ఇంట్లో ఏసీల్లో కూర్చున్నారు. బీటెక్ చదువుతున్న మా కుమారుడి ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు?” అంటూ అఖిల్ బంధువులు పోలీసులను ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో జరిగిన దశరథ్ గౌడ్, అరుణ్ గౌడ్ ను చితకబాది, చంపటానికి ప్రయత్నించిన ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోకముందే మరోసారి ఇలాంటి హత్య జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

సీతాఫ‌ల్ మండి ప్రాంతంలో యువ‌కుడి హ‌త్య పై అడిష‌న‌ల్ డీసీపీ న‌ర‌స‌య్య స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించినట్లు చెప్పారు. అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని అడిషనల్ డీసీపీ నరసయ్య తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, సీఐ ఓలేటి రామకృష్ణ, వారాసిగూడ సీఐ రాజేందర్ గౌడ్ ఉన్నారు.

Next Story