ప్రారంభించి పది నెలలు.. తొలగని చెత్తకుప్పలు..

by Thanuru Gopichand |

అంబర్ పేట ఫ్లైఓవర్ ఆర్భాటంగా ప్రారంభించి పారిశుద్ధ్యం మరిచారు.

ప్రారంభించి పది నెలలు.. తొలగని చెత్తకుప్పలు..
X

దిశ, అంబర్ పేట : అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రారంభమై పది నెలలు గడిచింది. ఫ్లైఓవర్ కింది భాగంలో శ్రీరమణ సినిమా హాల్ ఎదురుగా మహంకాళి దేవాలయం ఎదురుగా పేరుకుపోయిన మట్టి, రాళ్లు, నిర్మాణ వ్యర్థాలు అలాగే ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. దీనికి తోడు పెద్దపెద్ద పైపులు రోడ్డుకు సైడ్ కు అలాగే వదిలివేయడంతో రాత్రి సమయంలో ప్రయాణించే బైకర్స్ ప్రమాదనికి గురయ్యే అవకాశం ఉన్నది. అంబర్ పేట మహంకాళి గుడి ఎదురుగా ఉన్న నడి సర్వీస్ రోడ్డులో పెద్ద పెద్ద మట్టి కుప్పలు తొలగించకపోవడం, సర్వీస్ రోడ్డు పునః నిర్మించకపోవడంతో అక్కడి సమీపంలోని చిరు వ్యాపారులు దుమ్ము ధూళితో అనారోగ్యం పాలవుతున్నారు.

కాంట్రాక్టర్‌పై ఎందుకింత సానుభూతి?

ఈ సమస్యపై పలుమార్లు పత్రికల్లో వార్తలు, ఫొటోలు వచ్చినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నది. పనుల్లో జరుగుతున్న జాప్యానికి బాధ్యత వహించాల్సిన కాంట్రాక్టర్‌పై చర్యలు లేకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల శంకుస్థాపనల సమయంలో ఫొటోల కోసం పోజులు ఇచ్చే నాయకులకు అంబర్ పేట ఫ్లైఓవర్ కింద పేరుకుపోయిన మట్టి కుప్పలు కనిపించవా? దుమ్ముతో అల్లాడుతున్న ప్రజల గోడు వినిపించదా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే చొరవతో చేనెంబర్ చౌరస్తా నుంచి గోల్నాక వైపు సర్వీస్ రోడ్డు ప్రారంభమైనా, ఫ్లైఓవర్ కింద పలు పెండింగ్ పనులు పూర్తికనంతవరకు సమస్యలకు అది పూర్తి పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంబర్ పేట ఫ్లైఓవర్ కింద ఉన్న మట్టి కుప్పలు, నిర్మాణ వ్యర్థాలు, మిగిలిపోయిన పైపులు వెంటనే తొలగించాలని వాహనాదారులు కోరుతున్నారు.

Next Story