- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీ హెచ్చరిక.. తెలంగాణలో పాకిస్తానీయులకు రేపటి నుండే కౌంట్‌డౌన్..!
తెలంగాణలో నివసిస్తున్న పాకిస్తానీయులను వెనక్కి పంపించే ప్రక్రియ మొదలైందని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో నివసిస్తున్న పాకిస్తానీయులను వెనక్కి పంపించే ప్రక్రియ మొదలైందని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 230 మంది పాకిస్తాన్ పౌరులు నివాసం ఉంటున్నారని, వీరిలో 199 మంది లాంగ్ టర్మ్ వీసాల (LTVs) ఆధారంగా జీవిస్తున్నారని వివరించారు. లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్నవారి విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం స్పష్టమైందని, వారి జోలికి వెళ్లడం లేదని డీజీపీ స్పష్టం చేశారు.
మిగిలిన 31 మంది షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారని, వీరిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే 'లీవ్ ఇండియా' నోటీసులు కొంతమందికి జారీ చేసినట్టు తెలిపారు. ఆరోగ్య కారణాలతో వీసాలు పొంది ఉన్న వారికి ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చామని, మిగిలిన వారు రేపే దేశం విడిచి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీ వరకు అటారి బోర్డర్ ద్వారా పాకిస్తాన్ వెళ్లేందుకు అవకాశం ఉందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. అందుకే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని, షార్ట్ టర్మ్ వీసా గడువు ముగిసినా, దేశం విడిచి వెళ్లని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులతో సమన్వయంతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు డీజీపీ జితేందర్. ఇక మావోయిస్టుల ఏరివేతపై కూడా స్పందించిన డీజీపీ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలో ఎలాంటి ఆపరేషన్లను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భద్రతా దళాలు కర్రెగుట్ట దగ్గర మోహరించలేదని, ఆ ప్రాంతంలో ప్రస్తుతం మన బలగాలు పాల్గొనడం లేదు అని డీజీపీ జితేందర్ తేల్చి చెప్పారు.






