- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భవిష్యవాణి స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సహాయం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జరిగిన రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలతకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి మానవత్వం చాటారు.

దిశ, బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జరిగిన రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలతకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి మానవత్వం చాటారు. మారేడుపల్లిలో నివాసముంటున్న స్వర్ణలతకు గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కేటాయించి, పట్టాదాఖలాలు అందించిన మంత్రి... తాజాగా ఇంటి మరమ్మత్తుల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
బోనాల సందర్భంగా దేవాలయ సందర్శనకు వచ్చిన మంత్రి, గృహ ప్రవేశం చేశావా అమ్మ? అని స్వర్ణలతను అడిగారు. పక్కనే ఉన్న ఈవో మనోహర్ రెడ్డి స్పందిస్తూ.. ఇంటి డోర్లు విరిగిపోయాయని, లోపల మరికొన్ని పనులు మిగిలి ఉన్నాయని, ఆమె ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ‘‘ఎంత ఖర్చవుతుంది?’’ అని అడగగా, ఈవో లక్ష రూపాయలు అవుతాయని చెప్పారు.
దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి, ‘‘తానే ఖర్చును భరిస్తానంటూ, పనులు పూర్తిచేసుకోవాలి’’ అని చెప్పారు. కొద్ది గంటల వ్యవధిలోనే తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా ఆర్థిక సహాయం పంపించారు. శనివారం ఉదయం ఈవో మనోహర్ రెడ్డి చేతుల మీదుగా స్వర్ణలతకు ఆ డబ్బును అందించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ఈవో మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో మొదటి డబుల్ బెడ్‌రూమ్ లిస్టులో తన పేరు రాకపోయినా, ఈవో ద్వారా మంత్రి దృష్టికి వెళ్లిన తర్వాత రెండు రోజుల్లో కలెక్టర్‌కు ఆదేశించి తనకు ఇంటిని మంజూరు చేయించారని వివరించారు. ఇప్పుడు మరమ్మత్తులకూ సాయం అందించారని తెలిపారు. తన సమస్యను రెండు సార్లు సానుభూతితో స్వీకరించిన ఈవో మనోహర్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వంతోపాటు అధికారుల మానవీయతను ప్రశంసించారు.






