చార్మినార్ జోన్‌లో హోటళ్లు, లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు..

by Kodari Anjali |

చార్మినార్ జోన్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీలలో పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

చార్మినార్ జోన్‌లో హోటళ్లు, లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు..
X

దిశ, చంపాపేట్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో చార్మినార్ జోన్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీలలో పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో అతిథుల గుర్తింపు పత్రాలు, ఆధార్ కార్డులు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్-ఇన్ వివరాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా హోటల్, లాడ్జీల యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు.

నేరాలకు ఆస్కారం లేకుండా..

అతిథుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడం, గుర్తింపు పత్రాల ధృవీకరణ చేపట్టడం, సీసీటీవీ వ్యవస్థలను నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వంటి భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాతబస్తీలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలకు ఆస్కారం లేకుండా అప్రమత్త చర్యలు చేపట్టడం కోసం ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ, నగర భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, అన్ని వసతి గృహాలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Next Story