- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దుర్గం’ధ చెరువు.. చుట్టూ రెస్టారెంట్లు.. పబ్‌లు
చుట్టూ కొండలు, మధ్యలో కేబుల్ బ్రిడ్జి.. రెండు వైపులా నీరు.. అలా మధ్యలో నుంచి వాహనాల్లో ప్రయాణించే వారికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే దుర్గం చెరువు.. ఇప్పుడు అంద విహీనంగా.. దుర్గంధం వెదజల్లుతూ.. గుర్రపు డెక్కతో నిండిపోయి కనిపిస్తున్నది.

దిశ, శేరిలింగంపల్లి: చుట్టూ కొండలు, మధ్యలో కేబుల్ బ్రిడ్జి.. రెండు వైపులా నీరు.. అలా మధ్యలో నుంచి వాహనాల్లో ప్రయాణించే వారికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే దుర్గం చెరువు.. ఇప్పుడు అంద విహీనంగా.. దుర్గంధం వెదజల్లుతూ.. గుర్రపు డెక్కతో నిండిపోయి కనిపిస్తున్నది. ఇది వరకు పర్యాటక కేంద్రంగా విలసిల్లిన ఈ దుర్గం చెరువు.. ఇప్పుడు కంపు వాసన కొడుతున్నది. జీహెచ్ఎంసీ కమిషనర్ మారిన ప్రతిసారీ దుర్గం చెరువుకు రావడం.. అక్కడి పరిసరాలను పరిశీలించడం.. అధికారులకు సలహాలు, సూచనలు చేయడం పరిపాటిగా మారింది. కానీ మార్పు మాత్రం శూన్యమనే చెప్పాలి. హడావిడి, ఆరంభ శూరత్వం తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిన దుస్థితి. దుర్గం చెరువుపై పర్యాటక శాఖ ఆదాయం గడిస్తున్నా.. అభివృద్ధిపై మాత్రం దృష్టి పెట్టలేక పోతున్నది. చుట్టూ ఉన్న పబ్ లు, రెస్టారెంట్లు, నివాస సముదాయాల మురుగునీరు కూడా ఈ చెరువులోకే వస్తుండడంతో దుర్గం చెరువు కాస్త దుర్గంధంగా మారింది.
ఒకప్పటి మంచినీటి సరస్సు.. నేడు మురుగునీటిమయం..
చుట్టూ కొండల మధ్యలో ఉన్న దుర్గం చెరువు గతంలో నగరవాసులకు పర్యాటక కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. సీక్రేట్ లేక్ గా గుర్తింపు పొందిన ఈ చెరువు.. గతంలో గోల్కొండ కోటకు తాగునీటి వనరుగా ఉండేది. సైబరాబాద్ అభివృద్ధితో ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ దీని బాధ్యతలను పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. దీంతో అక్కడ రెస్టారెంట్లు, పబ్ లు వెలిశాయి. అలాగే అక్కడే బోటు షికారు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటున్న పర్యాటక శాఖ.. దుర్గం చెరువు అభివృద్ధిపై మాత్రం దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ మారిన ప్రతిసారి అధికారులతో కలిసి అక్కడ పర్యటించడం, అభివృద్ధి పనులు చేపట్టాలంటూ మ్యాప్ లు పట్టుకొని హడావుడి చేయడం మినహా చేసింది ఏమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మహానగర విస్తరణతో..
మహా నగర విస్తరణతో దుర్గం చెరువు మరింత మురికి కూపంగా మారుతున్నది. సమీప కాలనీల నుంచి మురుగునీరు చెరువులోకి చేరడం, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో అపార్ట్మెంట్ లు రావడంతో గతంలో 154.27 ఎకరాల్లో ఉన్న చెరువు ప్రస్తుతం చాలా వరకు కుచించుకు పోయింది. దీనికితోడు ఈ చెరువు గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో బోటు షికారుకు అంతరాయం ఏర్పడుతుంది. అయినా అక్కడికి వచ్చే పర్యాటకులను మురుగునీటిలోనే బోటు షికారు చేయిస్తున్నారు నిర్వహకులు. దుర్గం చెరువు అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని, పర్యాటక ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు కోరుతున్నారు.






