- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు..

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టు కింద బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం (జూన్ 21) ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న రహదారులపై వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం.36, రోడ్ నెం.45 వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి వెళ్లే వాహనాలకు ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 మార్గాలను వినియోగించాలని తెలిపారు. అదేవిధంగా ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి పంజాగుట్ట, ఎన్టీఆర్ భవన్, వెంకటగిరి వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెం.60, 67 రోడ్ నెం.1 ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. నిర్దేశిత మార్గాల్లో యూ-టర్న్‌లకు అనుమతి ఉండదని, వాహనదారులు రహదారి ఎడమ వైపున ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసుల సూచనలు, సైన్‌బోర్డులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రజలు రియల్‌టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను ఉపయోగించాలని, అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్, ఐపీఎస్ తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల కారణంగా చేపడుతున్న ఈ ట్రాఫిక్ మార్పులతో ప్రజలకు కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన అధికారులు, నగరవాసులు సహకరించాలని కోరారు.






