హైదరాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు !

by velandi.Saikiran |   (  Updated:2026-03-24 22:30:36  IST  )

హైదరాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, 50 నుంచి 60 రోజులకు సరిపడా నిల్వలుఉన్నాయని డీఎస్వో శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు !
X

దిశ, హైదరాబాద్ బ్యూరో/పరిగి : జీహెచ్ఎంసీ పరిధిలో పెట్రోల్ కొరతతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా సగానికి పైగా బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెరచి ఉన్న బంక్‌లలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఉప్పల్, మల్లాపూర్, నాగోల్, ఖైరతాబాద్, లోక్‌భవన్ రోడ్డు, అంబర్‌పేట్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్, బంజారాహిల్స్, లంగర్ హౌజ్, నాంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని కొన్ని బంకులు మూసి ఉండగా మంగళవారం దీని ప్రభావం తీవ్రమైంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు అకస్మాత్తుగా మూతపడ్డాయి. లాభాల కోసం యజమానులు కావాలనే ‘నో స్టాక్’ బోర్డులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్యాస్ కోసం రోడ్లపై బారులు తీరిన ఆటోలు

నగరంలో పెట్రోల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్ కొరత పెరుగుతోంది. మంగళవారం ఎంజీబీఎస్, లక్డీకాపూల్, కర్మన్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎంజీబీఎస్ వద్ద గ్యాస్ కోసం ఆటోలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంజీబీఎస్ నుంచి బయటకు వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు ఏజీ ఆఫీస్ నుంచి మొదలై లక్డీకాపూల్‌లోని భారత్ పెట్రోల్ బంకు వరకు వందలాది ఆటోలు గ్యాస్ కోసం వరుసలో నిలబడ్డాయి. గ్యాస్ నింపుకోవడానికి ఒక్కో ఆటో డ్రైవర్ దాదాపు రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది.

అసలు కారణం ఇదేనా?

నగరంలో పెట్రోల్ కొరతకు, ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధానికి సంబంధం లేదనే ప్రచారం జరుగుతోంది. డీలర్లకు ఆయిల్ కంపెనీలు అరువుపై పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేవి. తాజాగా కంపెనీలు నో క్రెడిట్ విధానాన్ని అమలు చేయడంతోపాటు, పాతబకాయిలు పూర్తిగా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించలేని డీలర్లు తాత్కాలికంగా బంకులు మూసి వేయడం, నగదు ఉన్నంత వరకే స్టాక్ తెప్పించుకోవడంతో అవి తొందరగా అమ్ముడై నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని ఓ బంక్ నిర్వాహకుడు వెల్లడించారు. బుధవారం ఉదయానికల్లా చమురు సంస్థలు డీలర్ల నగదు చెల్లింపుల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తే, మూతపడిన బంకులు తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. లేదంటే ఇది మరింతగా పెరిగి నగర రవాణాపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది.

200 బంకులు మూత

హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో (జీహెచ్‌ఎంసీ పరిధిలో) సుమారు 600 నుంచి 650 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుత ‘క్రెడిట్ పేమెంట్’ సమస్య మరియు ‘నో స్టాక్’ బోర్డుల పరిస్థితిని గమనిస్తే పూర్తిగా మూతపడినవి దాదాపు 30% నుంచి 35% బంకులు. అంటే సుమారు 200 బంకులు ఉండవచ్చు. మరో 20% బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే లేదా కేవలం డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడ కూడా నిల్వలు అడుగంటాయి. 45% నుంచి 50% బంకులు ప్రధానంగా కంపెనీ యాజమాన్యంలోని సీఓసీఓ బంకులు, పెద్ద డీలర్లు అడ్వాన్స్ పేమెంట్ చేసి స్టాక్ తెప్పించుకోవడంతో సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నాయి.

కొరత లేదు: డీఎస్వో శ్రీనివాస్

హైదరాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, 50 నుంచి 60 రోజులకు సరిపడా నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని డీఎస్వో శ్రీనివాస్ తెలిపారు. క్రెడిట్ పాలసీ విషయంలో మార్పులు రావడంతో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. మూసిన బంకుల నిర్వాహకులు స్టాక్ తెప్పించుకుని తెరిచేలా చర్యలు తీసుకుని వాహనదారుల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. నగరవ్యాప్తంగా సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Next Story