- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చల్లదనం మాటున విషం...ప్రమాదకరమైన ఐస్‌క్రీమ్‌లు.. కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు
రోడ్డు పక్కన ఆకర్షణీయంగా కనిపించే జ్యూస్ కౌంటర్లలో ఉపయోగించే పండ్ల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, చంపాపేట్: వేసవి వేడి పెరిగిన కొద్దీ చల్లని ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ జ్యూస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. గొంతు తడుపుకోవడానికి, ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు నమ్మకంతో కొనుగోలు చేస్తున్న ఈ ఆహార పదార్థాలే ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయనే ఆరోపణలు నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించే ఐస్‌క్రీమ్‌లు, రంగురంగుల జ్యూస్‌ల వెనుక ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే చీకటి వ్యాపారం నడుస్తోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్, చంపాపేట్, సంతోష్‌నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్ చదర్ఘాట్ ప్రాంతాల్లో గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌లపై కొత్త తేదీలు ముద్రించి మళ్లీ విక్రయించడం, కుళ్లిపోయిన పండ్లను కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు, అధిక మోతాదులో చక్కెరతో జ్యూస్‌లుగా మార్చి అమ్మడం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కొందరు వ్యాపారులు కాసుల వర్షం కురిపిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఎక్స్‌పైరీ డేట్‌కు మేకప్..
ఆహార పదార్థాలపై ముద్రించే తయారీ తేదీ, గడువు తేదీ వినియోగదారుల భద్రతకు అత్యంత కీలకం. కొందరు వ్యాపారులకు అవి కేవలం చెరిపేసే అంకెలుగా మారాయని ఆరోపణలున్నాయి. గడువు ముగిసిన ఐస్‌క్రీమ్ ప్యాకెట్లను పారేయకుండా, వాటిపై ఉన్న తేదీలను ప్రత్యేక రసాయనాలతో తొలగించి, ఆధునిక యంత్రాల సహాయంతో కొత్త తేదీలు ముద్రించి మళ్లీ మార్కెట్లోకి పంపుతున్నట్లు సమాచారం. పాడైపోయిన పాల పదార్థాలతో తయారైన ఈ ఐస్‌క్రీమ్‌లు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బయట మెరుపు… లోపల కుళ్లు
రోడ్డు పక్కన ఆకర్షణీయంగా కనిపించే జ్యూస్ కౌంటర్లలో ఉపయోగించే పండ్ల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మలక్‌పేట్ వంటి హోల్‌సేల్ మార్కెట్లలో తక్కువ ధరకు లభించే పాడైపోయిన పండ్లను సేకరించి, కుళ్లిన భాగాలను తొలగించి, మిగిలిన వాటికి కృత్రిమ రంగులు, ఎసెన్స్‌లు, అధిక మోతాదులో చక్కెర కలిపి ‘ఫ్రెష్ జ్యూస్’ పేరుతో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చూడటానికి రుచికరంగా కనిపించే ఈ జ్యూస్‌లు వాస్తవానికి శరీరానికి హానికరమైన రసాయనాల మిశ్రమమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీపి రుచిలో కనపడని విషం..
నాసిరకం పాల ఉత్పత్తులు, రసాయనాలతో నిల్వ చేసిన పండ్లు, కృత్రిమ రంగులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం వల్ల కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ సమస్యలు, అలర్జీలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చిన్నారులు అత్యంత ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహార పదార్థాలే ప్రమాదకరంగా మారడం సమాజానికి ఆందోళనకర సంకేతమని ప్రజలు అంటున్నారు.
ఫుడ్ సేఫ్టీ శాఖ ఎక్కడ?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి. నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపాలి. గడువు ముగిసిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవాలి. అవసరమైతే బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. ఈ ప్రాంతాల్లో అలాంటి చర్యలు కనిపించకపోవడంతో అక్రమార్కులు నిర్భయంగా దందా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సైదాబాద్, చంపాపేట్, సంతోష్‌నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్ ప్రాంతాల్లోని ప్రతి ఐస్‌క్రీమ్ పార్లర్, జ్యూస్ సెంటర్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించే వారిపై లైసెన్సులు రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడం, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.
- Tags
- ice creams
- fruits






