కొత్తపేటలో ట్రాఫిక్ కష్టాలు...రోడ్లపైనే పండ్ల వ్యాపారం

by velandi.Saikiran |

ఓమ్నీ హాస్పిటల్ చౌరస్తా నుంచి నాగోల్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్ల పక్కన పండ్ల, ఇతర వ్యాపారాలు చేసే వారికి ఒక్కొక్కరికి టాటా ఏస్ వాహనాలున్నాయి.

కొత్తపేటలో ట్రాఫిక్ కష్టాలు...రోడ్లపైనే పండ్ల వ్యాపారం
X

ట్రాఫిక్.. ట్రాఫిక్..

- కొత్తపేటలో ట్రాఫిక్ కష్టాలు

- రోడ్లపైనే పండ్ల వ్యాపారం

- గంటలకొద్దీ ఆగుతున్న వాహనాలు

దిశ, చైతన్యపురి: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు అన్నీఇననీ కావు. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నారు. ఇంట్లో నుండి వాహనం తీసుకొని బయటకు వెళితే చేరాలనుకున్న చోటికి సమయానికి చేరక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వ్యాపారాలు చేసుకునేవారు రోడ్లపైకి వచ్చి తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారు.

నిత్యం ట్రాఫిక్ కష్టాలు..

కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ చౌరస్తా నుంచి నాగోలు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. మహాలక్ష్మి థియేటర్ వద్ద కొత్తపేట గ్రామానికి వెళ్లే రహదారి మోడల్ డెయిరీ మిల్క్ డబ్బా వద్ద మారుతి నగర్ వెళ్లే చౌరస్తాలో ప్రతిరోజూ ఉదయం వాహనదారులకు ఆటంకం ఏర్పడుతున్నది. ఇక్కడ ఉన్న ఫ్రూట్ మార్కెట్ బాటసింగారం తరలిపోయినా ఇక్కడ కొంతమంది గోదాములు ఏర్పాటు చేసి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కుల ద్వారా పండ్లు సరఫరా అవుతున్నాయి. ఇక్కడ వ్యాపారం చేసే వ్యాపారులు చిరువ్యాపారులకు, వీధివ్యాపారులకు విక్రయిస్తుంటారు. వచ్చిన ట్రక్కులు ప్రధాన రహదారిపై నిలిపి సరుకు కిందకు దించడం, ఆ సమయంలో వాహనాల రాకపోకలు రావడం, స్థలం సరిపోక ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారింది. గత వారం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున ఆ రోడ్డు వెంట వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ట్రాఫిక్ జామ్ కావడం వలన పరీక్షలకు ఆలస్యంగా వెళుతున్న సందర్భాలు జరుగుతున్నాయి. కొంతమంది మరో మార్గంలో పరీక్ష కేంద్రాలకు చుట్టూ తిరిగి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితులను పర్యవేక్షించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.

చాలాన్లకే పరిమితమా..?

ట్రాఫిక్ పోలీసుల తీరు వాహనదారులు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఎవరైనా వాహనదారుడు రాంగ్ రూట్ లో వెళ్లినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా, నో పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసినా ఫొటోలు తీసి కేవలం చలాన్లకే పరిమితమవుతారా? అని ప్రశ్నిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఒక ఉదయం పూటనే కాకుండా సాయంత్రం సమయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వారంటున్నారు.

వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తేనే..

ఓమ్నీ హాస్పిటల్ చౌరస్తా నుంచి నాగోల్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్ల పక్కన పండ్ల, ఇతర వ్యాపారాలు చేసే వారికి ఒక్కొక్కరికి టాటా ఏస్ వాహనాలున్నాయి. కోహెడ మార్కెట్ నుంచి తమతమ వాహనాల్లో పండ్లు తెచ్చి ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ కావడానికి కారకులవుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని, తద్వారా వాహనదారులకు ప్రయాణం సాఫీగా జరుగుతుందంటున్నారు. ఈ విషయమై ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును సంప్రదించగా.. ప్రతిరోజూ ఉదయం పూట తనతో పాటు సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తుననామని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ట్రాఫిక్ జామ్ కాకుండా కొంతవరకు సమస్యకు పరిష్కారానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. త్వరలో శాశ్వత పరిష్కారం చూపడానికి ముందుకు వెళుతున్నామని చెప్పారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.

Next Story