ఫౌమ్‌హౌజ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో నో టికెట్...?

by Dishanational1 |
ఫౌమ్‌హౌజ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో నో టికెట్...?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావుకు ఎదురుగాలి వీస్తున్నది. సొంత నియోజకవర్గాల్లో వారికి మైలేజ్ రావడం లేదు. పైగా ఇప్పటివరకు ఉన్న గ్రాఫ్ డౌన్ అయినట్టు సమాచారం. బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో సీక్రెట్‌గా క్షేత్రస్థాయిలో తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లో ఈ విషయం తేలింది. ఈ నలుగురు పులిబిడ్డలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆణిముత్యాలు అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ఓపెన్‌గానే కామెంట్ చేశారు. కానీ వారి సొంత నియోజకవర్గాల్లో మాత్రం అలాంటి అనుకూల పరిస్థితులు లేవని తేలింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసినవారికే ఈసారి ప్రజల నుంచి ఆదరణ పెరిగినట్టు స్పష్టమైంది. ఫామ్‌హౌజ్ వ్యవహారం ఆ నలుగురు ఎమ్మెల్యేలను హీరోలుగా చేస్తుందనుకుంటే.. ఉన్న ఇమేజ్ కూడా దెబ్బతినడానికి కారణమైందని స్థానికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ ఆశావహులు తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదోనని ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌కు ముందు డైలమాలో ఉండేవారు. ఇక తాజా పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు తెలియడంతో ఆశావహులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు పార్టీ నుంచి టికెట్ రాకుంటే స్వతంత్రంగా పోటీ చేసినా గెలుస్తామనే ధీమా వారిలో ఏర్పడింది. ఈసారి సిట్టింగ్‌లకే టికెట్లు అని సీఎం ప్రకటించారు. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఒక వేళ టికెట్ ఇస్తే ఫలితాలు ఎలా వస్తాయన్న అనుమానాలు మొదలయ్యాయి.


సీఎం కామెంట్స్‌కు భిన్నంగా అభిప్రాయాలు

అప్పటికే ప్రజల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలపై ఉన్న ప్రతికూల అభిప్రాయానికి ఫామ్ హౌజ్ కేసు కూడా తోడయిందని తేలింది. వీరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. మరోవైపు ఖరీదైన బంగళాలు కట్టుకోవడం, లగ్జరీ కార్లలో తిరగడం, ఆస్తులను పోగేసుకోవడం, సంపదను పెంచుకోవడం వంటివి తోడయ్యాయి. ఫామ్ హౌజ్ కేసు విషయంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలు అంటూ సీఎం పొగిడినా.. ప్రజల్లో మాత్రం భిన్నాభిప్రాయమే ఉన్నట్టు వెల్లడైంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గాల్లో మాజీలతో గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రస్తుతం ఇది అంతర్గతంగా కొనసాగుతున్నా.. ఎలక్షన్ టైంలో బహిర్గతం అయ్యే చాన్స్ ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గాల్లో టికెట్ రాని నేతలు, గతంలో గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారు ఉన్నారు. అలాంటి వారి చేతుల్లో ఈ నలుగురికి చిక్కులు తప్పవని ఓటర్ల అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నలుగురిలో ముగ్గురు.. కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీకి వచ్చినవారే కావడం గమనార్హం. ఫామ్ హౌజ్ కేసు దర్యాప్తు సీబీఐ చేతిలోకి వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Read more:

ఏపీలో విస్తరణకు BRS భారీ స్కెచ్..! రంగంలోకి కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే సీనియర్ నేత!


Next Story

Most Viewed