నిలోఫర్‌లో సమస్యల రాజ్యం.. మూడు నెలలుగా పని చేయని లిఫ్ట్‌లు

by Ajay Maddhiboyina |

నిలోఫర్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆసుపత్రిలోని ఓపీ భవనంలో సుమారు మూడు నెలలుగా లిఫ్టులు పనిచేయడం లేదు. ఈ భవనంలో 4 లిఫ్టులు ఉండగా.. అందులో ఒకటి వైద్యులు వినియోగిస్తున్నారు. మరో మూడు రోగుల కోసం ఏర్పాటు చేశారు.

నిలోఫర్‌లో సమస్యల రాజ్యం.. మూడు నెలలుగా పని చేయని లిఫ్ట్‌లు
X

దిశ , కార్వాన్: నిలోఫర్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆసుపత్రిలోని ఓపీ భవనంలో సుమారు మూడు నెలలుగా లిఫ్టులు పనిచేయడం లేదు. ఈ భవనంలో 4 లిఫ్టులు ఉండగా.. అందులో ఒకటి వైద్యులు వినియోగిస్తున్నారు. మరో మూడు రోగుల కోసం ఏర్పాటు చేశారు. అయితే రోగులకు ఏర్పాటు చేసిన వాటిలో రెండు లిఫ్టులు నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ఉన్న ఒక్క లిఫ్టు కోసం రోగులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కోసారి సాంకేతిక కారణాలతో, ఆపరేటర్ లేకుండా పోవడంతో ఉన్న లిఫ్ట్ లు కూడా రోగులకు అందుబాటులో ఉండడం లేదు. అత్యవసరమైతే ఐదు అంతస్తులు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తున్నది . రోగులకు ఇచ్చే మెడిసిన్స్ తో పాటు చేయాల్సిన వైద్య పరీక్షలను సైతం కమిషన్లకు ఆశపడి ప్రైవేట్ మెడికల్ షాప్స్, ల్యాబ్స్ కు పంపిస్తున్నారు . రోగుల కోసమే వినియోగించాల్సిన స్ట్రెచర్లు ఇతర పనులకు వినియోగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అత్యవసర వైద్యం కోసం వచ్చిన పిల్లలకు సరైన వైద్య సేవలు అందడం లేదు . వైద్య పరీక్షలు చేయాల్సిన టెక్నీషియన్స్ అందుబాటులో లేరనే సాకుతో టెస్టులకు బయటకు పంపుతుండడంతో పేద రోగులు, వారి సహాయకులు పడరాని పాట్లు పడుతున్నారు.

మీటింగ్ లకే పరిమితం..

ఆస్పత్రి ఉన్నతాధికారులు గంటల పాటు మీటింగ్ ల పేరుతో కాలయాపన చేస్తున్నారని, రోగులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3 నెలల క్రితం ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ విజయ్ కుమార్ హాస్పిటల్ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని, కేవలం మీటింగ్ ల పేరుతో చాంబర్ కే పరిమితం అవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో ఆయన దృష్టికి వెళ్లడం లేదు. ఏదన్నా సమస్య ఆయన వద్దకు వెళ్లినా ఆర్ఎంఓ, కింది స్థాయి అధికారులకు వదిలేసి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టెండర్లు లేకుండానే ...?

నిలోఫర్ ఆస్పత్రిలో ఏడాది క్రితం డైట్, సెక్యూరిటీ కాంట్రాక్టులు ముగిశాయి. అయితే సకాలంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉండగా.. సూపరింటెండెంట్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో డైట్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇన్ పేషంట్లకు సరఫరా చేయాల్సిన ఆహారంలో నాణ్యత లోపించిందని రోగులు వాపోతున్నారు. డైట్ కాంట్రాక్టర్ తో హాస్పిటల్ అధికారులు కుమ్మక్కయ్యారని, వారి నుంచి వచ్చే పర్సేంటేజీలకు అలవాటుపడి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే టాక్ సైతం వినబడుతున్నది.

డబ్బులు వసూలు చేస్తున్న సెక్యూర్టీ సిబ్బంది..?

నిలోఫర్ హాస్పిటల్ లో పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది రోగులు, వారి సహాయకుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఎవరన్నా వారిని ప్రశ్నిస్తే లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగుల సహాయకులు వాపోతున్నారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ముక్కు పిండి రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా సూపరింటెండెంట్ తో సహా ఇతర అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా పరిస్థితులు మారాయి.

ఎమ్మెల్యేనే పట్టించుకోవడం లేదు.. మీరెంత..?

హాస్పిటల్‌లో నెలకొన్న సమస్యలను కొంతమంది రోగులు, వారి సహాయకులు దిశ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫొటోలు తీసేందుకు వెళ్లిన ప్రతినిధిపై అక్కడ విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. సమస్యల గురించి ఫొటోలు తీస్తుండగా అడ్డుకొని వాటిని డిలీట్ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. సూపరింటెండెంట్ అనుమతిలేనిదే లోనికి రాకూడదని హుకూం జారీ చేశారు. హాస్పిటల్ సమస్యల గురించి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులే పట్టించుకోవడం లేదు, మీరెంత అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. డ్యూటీ ఆర్ఎంఓ సైతం సూపరింటెండెంట్ అనుమతి లేనిదే ఫొటోలు తీయరాదని, వార్తలు రాయొద్దని అనడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది. హాస్పిటల్ లో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతుండగా వాటిని హాస్పిటల్ అధికారులు పట్టించుకోవడం లేదని, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రోగులు, వారి సహాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story