వాట్సాప్ కాల్స్‌పై సిట్ నజర్..600 ఫోన్ నంబర్ల డాటా !

by velandi.Saikiran |   (  Updated:2026-01-24 21:15:37  IST  )

వాట్సాప్ కాల్స్‌పై సిట్ నజర్..600 ఫోన్ నంబర్ల డాటా !
X

దిశ, సిటీక్రైం: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ప్రత్యేకంగా వాట్సాప్ కాల్స్‌పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో దాదాపు 600 వాట్సాప్ కాల్స్ రికార్డుల కోసం సంబంధిత వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) సంస్థలకు లేఖలు రాసింది. 2023 జనరల్ ఎలక్షన్ సందర్భంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రాథమికంగా పోలీసులు చేసిన దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా సిట్ ఇప్పుడు వాట్సాప్‌తో పాటు ఇతర వర్చువల్ నెంబర్ల డాటా కోసం ఆరా తీస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులతో పాటు ఇతర అనుమానితులకు సంబంధించిన వాట్సాప్ కాల్ చిట్టాను విశ్లేషించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సేకరించిన ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగా వీపీఎన్ నంబర్ల డాటా వస్తే మరిన్ని సాంకేతిక ఆధారాలు లభిస్తాయని పోలీసులు ఆశిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అనుమానిస్తున్న వారందరూ వాట్సాప్ కాల్స్ ద్వారా ఏ లొకేషన్లలో ఉండి మాట్లాడారు.. ఎంత సేపు మాట్లాడారు.. ఏ సందర్భంలో ఏ రోజు ఫోన్ కాల్స్ వెళ్లాయి, వచ్చాయి.. ఇంటర్నెట్‌ను ఎన్ని గంటల పాటు వినియోగించారు? ఇలా అనేక విషయాలను ఇంటర్నెట్ ప్రొటోకాల్ డివైజ్ రికార్డుల ద్వారా వచ్చే సమాచారంతో పోలీసులు మరింత లోతుగా విశ్లేషించనున్నారని విశ్వసనీయ సమాచారం.

Next Story