- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ కేంద్రంగా సైబర్ మోసం..
సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని రూ.1.46 కోట్ల మేర మోసం చేసిన కేసులో నలుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

దిశ, సిటీ క్రైమ్: సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని రూ.1.46 కోట్ల మేర మోసం చేసిన కేసులో నలుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఫిబ్రవరిలో 'సంగం మ్యాట్రిమోనీ'లో తన ప్రొఫైల్ చూసి వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటూ ఓ యువతి వాట్సాప్ కాల్ ద్వారా పరిచయమైంది. అనంతరం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి విడతల వారీగా మొత్తం రూ.1.46 కోట్లను పెట్టుబడిగా పెట్టించింది. ట్రేడింగ్ యాప్‌లో భారీ లాభాలు కనిపించినప్పటికీ, వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించాలని మోసగాళ్లు డిమాండ్ చేశారు. అనంతరం విత్‌డ్రా ఆప్షన్‌ను పూర్తిగా తొలగించడంతో బాధితుడికి అనుమానం వచ్చి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో భాగంగా 10 నుంచి 30 శాతం కమిషన్‌కు బ్యాంకు ఖాతాలు అందిస్తున్న సిద్ధిపేటకు చెందిన సంపత్, సికింద్రాబాద్‌కు చెందిన నరేష్, సురేశ్, మహేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సైబర్ నేరగాళ్లు సింగపూర్ నుంచి అమాయకులను మోసం చేసి దోచుకున్న నగదును వీరి బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించేవారని, అనంతరం కమిషన్ తీసుకుని మిగిలిన డబ్బును హవాలా మార్గంలో సింగపూర్‌కు పంపిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో తెరిచిన ఖాతాల్లో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ మోసాల నగదు జమ అయినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ అరెస్టులతో హైదరాబాద్ నుంచి సింగపూర్ వరకు విస్తరించిన ఓ సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వడం కూడా నేరమేనని, ప్రజలు అలాంటి ప్రలోభాలకు గురికావద్దని హెచ్చరించారు.






