- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడియాలజిస్టుల కొరత.. భారంగా ‘ప్రైవేటు వైద్యం’
యూడీఐడీ సర్టిఫికెట్ల జారీకి కూాడా ఇబ్బందులు. ఇబ్బందులు బదిరులు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఆడియాలజీ’ (వినికిడి లోపానికి చికిత్స అందించే) వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు వినికిడి సమస్యలను గుర్తించి.. తగిన పరిష్కారం చూపాల్సిన ఈ విభాగం నిర్లక్ష్యానికి గురవుతున్నది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రెగ్యులర్ ఆడియాలజిస్ట్ లేకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పేదలకు భారంగా వైద్యం
ఆరోగ్య శ్రీ కింద ఆడియాలజీకి సంబంధించి మూడేళ్లలోపు పిల్లలకు మాత్రమే శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. ఆ వయసు దాటిన వారికి ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు. అక్కడ ఆపరేషన్లు, ఆ తర్వాత ఏడాది పాటు ఇచ్చే స్పీచ్ థెరపీకి లక్షల రూపాయలు ఖర్చవుతోంది. దీంతో ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని చూసి మదనపడడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
భర్తీకి నోచుకోని పోస్టులు
రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పథాలజీ (ASLP) పోస్టు తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్నేళ్లుగా వీరు లేకపోవడంతో ఆడియాలజీ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లల్లో కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను వీరే చేయాల్సి ఉంటుంది. ఇలా శస్త్ర చికిత్స చేసిన అనంతరం సంవత్సరం పాటు మాట్లాడడంలో శిక్షణ ఇస్తారు. కానీ కొన్నేళ్లుగా ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఒక్కరంటే ఒక్క కాంట్రాక్ట్ డాక్టర్‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో రోగులకు సేవలందించడం కష్టంగా మారుతున్నది.
చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం
పుట్టిన పిల్లల్లో చెవుడు సమస్య ఉంటే వారికి ఇతరులు మాట్లాడే మాటలు వినిపించవు. దీనిని మూడేండ్ల లోపే గుర్తించి వారికి చికిత్స చేయాలి. లేకపోతే వారు మూగవారిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా మాటలు రాని పిల్లలను హాస్పిటల్‌కు తీసుకువెళ్లి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎదుటి వారి మాటలు వినబడేందుకు ‘కోక్లియర్ ఇంప్లాంట్స్’ వంటి పరికరాలను ఎంపిక చేసి వాటిని సరిగ్గా అమర్చడంలో ఆడియాలజీ డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీరు లేకపోవడంతో వైద్యం అందక చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది.
యూడీఐడీ జారీలోనూ ఇబ్బందులు
గతంలో శారీరక వైకల్యం ఉన్న వారికి సదరమ్ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు వాటి స్థానంలో డిసేబుల్డ్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే వీటి జారీలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడియాలజీ వైద్యులు లేకపోవడంతో యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిఫికేషన్ (UDID) సర్టిఫికెట్ల జారీ ప్రశ్నార్థకంగా మారింది. వినికిడి సమస్య ఉన్న వారిని గుర్తించి వారికి దేశంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. పెన్షన్లు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు, బస్సు, రైల్వే పాసులకు ఈ సర్టిఫికెట్ కీలకం. రెగ్యులర్ డాక్టర్లు లేకపోవడం, కాంట్రాక్ట్ సిబ్బందిపైనే ఆధారపడడంతో సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడమే కాకుండా.. అక్రమాలు చోటుచేసుకునే అవకాశముంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెగ్యులర్ ఆడియాలజీ పోస్టులను భర్తీ చేయాలని రోగులు కోరుతున్నారు.






