ట్రోప్స్ బార్‌ టెక్నిక్.. ఖరీదైన బాటిల్‌లో చీప్ మద్యం.. రిచ్ లాభం..!

by Bhanu |   (  Updated:2025-04-25 10:03:15  IST  )

అధిక ధరల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, స్పిరిట్, నీళ్లను కలిపి మందుబాబులకు సప్లై చేస్తూ లక్షలు గడుస్తున్నారు కొందరు అక్రమార్కులు.

ట్రోప్స్ బార్‌ టెక్నిక్.. ఖరీదైన బాటిల్‌లో చీప్ మద్యం.. రిచ్ లాభం..!
X

దిశ, శేరిలింగంపల్లి : అధిక ధరల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, స్పిరిట్, నీళ్లను కలిపి మందుబాబులకు సప్లై చేస్తూ లక్షలు గడుస్తున్నారు కొందరు అక్రమార్కులు. వాటిని తమ బార్ అండ్ రెస్టారెంట్, పబ్ లకు వచ్చిన వారికి సప్లై చేస్తూ వీకెండ్ లలో లక్షలు గడిస్తున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం నింపి సప్లై చేస్తున్న కిచెన్ అండ్ రెస్టారెంట్ పై విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు. వారి వద్ద నుండి రూ. 1.48 లక్షల విలువైన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో అయ్యప్ప సోసైటీలోని ట్రోప్స్ బార్‌ను రెన్యూవల్ చేయలేదు. ఫీజు కూడా చెల్లించలేదని రంగారెడ్డి ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ ఎక్సైజ్‌ సిబ్బంది కలిసి బార్‌ లో తనిఖీకి వెళ్లారు. బార్‌ లో కూకట్‌ పల్లికి చెందిన సత్యనారాయణ, పునిత్ పట్నాయక్‌ కలిసి ఖరీదైన మద్యం బాటిళ్లను సీల్‌ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.


రూ. 2690 ధర కలిసి జెమ్‌సన్‌ బాటిల్లో రూ.1000 ధర కలిగిన ఓక్స్‌మిత్‌ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు. బార్ లో మద్యాన్ని కల్తీ చేస్తున్న స్థలంలో ఎక్కువ బాటిళ్లలో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా ట్రోప్స్ బార్‌ లైసెన్స్‌ ఫీజ్ చెల్లించలేదు. దీనికి తోడు మద్యం డిపోల మద్యం తీసుకోవడం లేదనే అనుమానంతో ఎక్సైజ్‌ యంత్రాంగం తనిఖీలకు వెళ్లారు. ఇతర మద్యం దుకాణాల్లో మద్యం బాటిల్లను కొనుగోలు చేసి ఎక్కువ ధరలు కలిగిన బాటిళ్లలో తక్కువ ధరల కలిపిన మద్యాన్ని కలుపుతూ అమ్మకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో వెల్లడయ్యింది. రూ.1.48 లక్షల విలువ చేసే మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకొని, బార్‌ లైసన్స్‌ ఓనర్‌ ఉదయ్ కుమార్ రెడ్డి, మేనేజర్‌ వి. సత్యనారాయణ రెడ్డి, బార్‌ లో పని చేసే ఉద్యోగి పునిత్‌ పట్నాయక్‌ లపై కేసు నమోదు చేసి శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ తెలిపారు.

Next Story