- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలాల్లో పేరుకుపోతున్న పూడిక.. ముంపు భయంలో కాలనీలు!
శేరిలింగంపల్లిలో నాలాల పూడికతీత పనులు నిలిచిపోవడంతో కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, శేరిలింగంపల్లి: పూడికతీత పేరుతో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం శాపంగా మారింది. మదీనాగూడ ఈర్ల చెరువుకు వర్షపు నీటిని మోసుకొచ్చే ప్రధాన నాలా పూడికతో నిండిపోయింది. రూ.7.41 కోట్ల వ్యయంతో ప్రధాన కాలువ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. కాలువ నిర్మాణం పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. ఇందుకోసం వెచ్చించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ప్రస్తుతం ఈ కాలువ పూడుకుపోయి చుక్కనీరు చెరువులోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మంజీరా రోడ్డు నుంచి దీప్తి శ్రీనగర్ మీదుగా పటేల్ చెరువుకు వెళ్లే ప్రధాన కాలువ నిర్మాణదారులు కబ్జా చేసి పైకప్పు నిర్మించి భారీ భవంతులు నిర్మిస్తున్నారు. ప్రతిఏటా వర్షపు నీరు పోయే వీలు లేక కాలనీలు నీటి ముంపునకు గురవుతున్నాయి.
నాలా నిండా పిచ్చి మొక్కలే..
పటేల్ చెరువు నుంచి గంగారం పెద్ద చెరువులోకి వచ్చే నాలా పూర్తిగా చెట్లు, పిచ్చిమొక్కలతో మూసుకుపోయింది. వర్షాకాలంలో ఏర్పడే వరదలతో కాలనీలు, బస్తీలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నాలాల పూడికతీత పనులు చేపట్టాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి అన్ని డివిజన్లల్లో నాలాల పరిస్థితి ఇలానే ఉంది. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులతో అకాల వర్షాలు కురిస్తే రోడ్లపైనే వర్షపు నీరు నిలుస్తుంది. వాటర్ లాగింగ్ పాయింట్లు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు, సీఎంసీ అధికారులు పదేపదే చెబుతున్న అమలుకు నోచుకోవడం లేదు.
ఇళ్లు చెరువులుగా.. చెరువులు మైదానాలుగా..
వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పలు కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చెరువుల్లో చుక్కనీరు చేరదు. చెరువుల్లోకి నీటిని మోసుకొచ్చే ప్రధాన కాలువలు పూడికతో నిండిపోవడమే ఇందుకు కారణం. సుందరీకరణ పేరుతో, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువుల్లోకి చుక్క నీరు చేరకుండా భారీ కుట్రకు తెరలేపారు. శేరిలింగంపల్లి మండలంలో ఉన్న సింహభాగం చెరువుల పరిస్థితి ఇదే. చెరువుల అభివృద్ధి పేరుతో నాలాలు ధ్వంసం చేసి వర్షపు నీరు చెరువుల్లోకి రాకుండా చేయడంపపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.






