సప్పుడు లేకుండా సన్నబియ్యం దందా

by velandi.Saikiran |

ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్ సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. సీతాఫలమండి, చిలకలగూడ, వారాసిగూడ, బౌద్ధ నగర్ ప్రాంతాల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లుతున్నాయి.

సప్పుడు లేకుండా సన్నబియ్యం దందా
X

దిశ, సీతాఫలమండి : ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్ సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. సీతాఫలమండి, చిలకలగూడ, వారాసిగూడ, బౌద్ధ నగర్ ప్రాంతాల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లుతున్నాయి. నిరుపేదలకు చేరాల్సిన సన్న బియ్యం దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రతి రేషన్ దుకాణం వద్ద ఒకరి నుంచి నలుగురి వరకు యువకులు దళారులుగా మారుతున్నారు. రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్నట్టు నటిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డుదారుల పేరుతో తీసుకున్న సన్నబియ్యాన్ని కిలోకు రూ.10 చొప్పున రేషన్ దుకాణంలోనే కొనుగోలు చేసి, అక్కడికక్కడే రేషన్ దుకాణ యజమానికి నగదు చెల్లిస్తున్నారు. స్కూటర్లు, ఇతర వాహనాలపై సమీపంలోని గోదాంలకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు.

మహిళలను బెదిరిస్తూ..

రేషన్ కోసం వచ్చే మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తూ, పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని బహిరంగంగానే కొలత వేసి దళారుల చేతికి అప్పగించడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1న మొదటగా వచ్చే సన్న బియ్యం ముందుగా దళారులకే చేరడం, ఈ అక్రమ వ్యవస్థ ఎంత లోతుగా వేళ్లూనుకుందో స్పష్టంగా అర్థమవుతుందని వాపోతున్నారు. ఈ అక్రమ రేషన్ బియ్యం దందా స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరుగుతున్నా, ఎలాంటి చర్యలు లేకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యం దళారుల దందా వెనుక ఎవరి హస్తం ఉందో బయటపడాల్సిన అవసరం ఉందని, అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పేదల హక్కులపై దెబ్బ..

ప్రభుత్వం నిరుపేదల కోసం ఉచితంగా అందిస్తున్న ఈ సన్న బియ్యం కూడా వారికి దక్కకుండా, దళారుల పెత్తనం రోజు రోజుకీ పెరిగిపోతోందని బౌద్ధ నగర్, వారాసిగూడ, సీతాఫలమండి, చిలకలగూడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు నింపుకోవడానికి వచ్చే బియ్యం మీద కూడా దందా ఏంటి? అని నిరుపేదలు ప్రభుత్వాన్ని, అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మేలు..

రేషన్ దళారుల అక్రమాన్ని అరికట్టాలంటే ముందు రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి సంబంధించిన అధికారి ఆఫీసులో కనపడేలా మానిటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ సన్న బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రేషన్ బియ్యం నేరుగా అర్హులైన పేదలకే అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story