హైడ్రా కళ్లెదుటే ‘ఈదులకుంట’ మాయం.. రూ.500 కోట్ల చెరువు స్థలం ప్రైవేట్ బిల్డర్లకు ధారాదత్తం

by Malleboina Mahesh |

ఖానామెట్‌లో రూ.500 కోట్ల విలువైన 'ఈదులకుంట' చెరువు కబ్జాకు గురైంది. అధికారుల నిర్లక్ష్యంపై విపక్షాలు ఎన్‌జీటీని ఆశ్రయించాయి.

హైడ్రా కళ్లెదుటే ‘ఈదులకుంట’ మాయం.. రూ.500 కోట్ల చెరువు స్థలం ప్రైవేట్ బిల్డర్లకు ధారాదత్తం
X

దిశ, శేరిలింగంపల్లి : ఖానా మెట్ సర్వే నంబర్ 7లో 5.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. రూ.500 కోట్లు విలువ చేసే తటాకం రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. రంగారెడ్డి కలెక్టర్ ఈదులకుంటను 22 ఏ నిషేధిత జాబితాలో చేరుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. శాటిలైట్ చిత్రాలు అక్కడ నీటి కుంట ఉన్నట్టు స్పష్టంగా చెబుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూడు పర్యాయాలు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా సర్వే నిర్వహించారు. ఇవేవీ కబ్జాదారులను ని లువరించలేకపోయాయి. కలెక్టర్ ధ్రువీకరించిన ఈదులకుంట లేనేలేదని కబ్జాదారులు దర్జాగా చెరువును ధ్వంసం చేసి జేసీబీలతో రాత్రి పగలు మట్టి తొలగించి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

సర్వే నెంబర్ 10 03 నుంచి 1006 వరకు ఉన్న భూమి ఓ కనస్ట్రక్షన్ కంపెనీకి చెందిన భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్ 7 చెరువు శిఖంగా నమోదై ఉంది. ఒకవేళ ఓవర్ లా పింగ్ అయితే రెండు మండలాల రెవెన్యూ అధికారులు చర్చించుకొని రక్షించాల్సి ఉండగా.. చేతులు ఎత్తేశారు. ఇదే సమస్య ప్రైవేటు వ్యక్తులు అయితే తమ ఆస్తులు గా పరిగణించి క్లెయిమ్ చేయకుండా ఉంటారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఓవర్ లాపింగ్ పేరుతో దొంగాట..

ఓవర్ లాపింగ్ పేరుతో రెవెన్యూ అధికారులు దొంగాట ఆడుతున్నారు. చెరువుని రక్షించి తీరుతామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మౌనం వెనుక మతలబు ఏమిటి? ఈదులుకుంటున్న రక్షిస్తారా..? కబ్జా చేస్తున్న నిర్మాణ సంస్థకు ధారాదత్తం చేస్తారా? ప్రజల ఆస్తులు కాపాడుతామంటూ చట్ట సభ సాక్షిగా ప్రమాణం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఖానా మెట్ సర్వే నంబర్ 7లో 6.5 ఎకరాల చెరువు శిఖం స్థలం ఉన్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు, సీసీఎల్ఏకు, కలెక్టర్ కు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గత ఏడాది నవంబర్ 11న రాసిన లేఖలో పేర్కొన్నారు. అందులోనూ ఈదులకుంట శిఖం.. సర్కారీ స్టేట్ గవర్నమెంట్ అని శేరిలింగంపల్లి తహశీల్దార్, డిప్యూటీ కలెక్టర్ పేర్కొన్నారు.

ఉదాసీనత ఎందుకో?

మూసాపేట్ సర్వేనెంబర్ 348/ఏ వరకు, ఇక అల్లాపూర్ గ్రామంలో ఉన్న లాస్ట్ సర్వే నెంబర్ 56 చివరి నెంబర్ గా ఉంది. కూకట్ పల్లి సర్వే నెంబర్లలో 1063 నుంచి 1000 వరకు హౌస్ సైట్స్ ఉన్నాయి. ఖానా మెట్ పక్కనే ఉన్న, గత మూసాపేట్ మధ్య ఉన్న భూముల విషయంలో ఓవర్ ల్యాపింగ్ జరగాలి. మూసాపేట్ సర్వేనెంబర్ 348/ఏ వరకు ఆ సర్వే నెంబర్లు పూర్తవుతున్నాయి. ఎక్కడా కబ్జాదారులు పేర్కొన్న సర్వే నంబర్లు ఈదులకుంట పరిసరాల్లో లేవని నిపుణులు చెబుతున్నారు. కొండాపూర్ జంగం కుంట విషయంలో ఇరిగేషన్ అధికారులు హెచ్ఎండిఏ లేక్ జాబితాలో లేదంటూ డ్రామాలు ఆడి తే రెవెన్యూ రికార్డుల ప్రకారం హైడ్రా ఆధికారులు రూ.200 కోట్లు విలువ చేసి నాలుగు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈదులకుంట విషయంలోనూ ఇరిగేషన్ అధికారులు ఇదే దొంగాట ఆడుతున్నారు.

జంగంకుంట విషయంలో హైడ్రా ఆధికారులు దూకుడు ఈదులకుంట విషయంలో లేకుండా పోయింది. ఈదులకుంటను రక్షించి తీరుతామన్న హైడ్రా ఆధికారులు బొక్క బోర్లా పడ్డారు. కాగా, ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా శాఖల అధికారుల మౌనం ఈదులకుంటకు శాపంగా మారింది. శేరిలింగంపల్లి లో అనేక చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చెరువుల్లో నిర్మాణాలకు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇందుకు బాధ్యులైన అధికారులను గుర్తించినా ఇంతవరకు చర్యలు లేకపోవడంతో ఆ శాఖ అధికారులు బరితెగింపు తారాస్థాయికి చేరింది. ఇప్పుడది ఈదుల కుంటను చెరబట్టేలా చేసింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు

ఈదులకుంట కబ్జా వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేశాం. ఈ కుంట కబ్జాల వ్యవహారం ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చాం. హైడ్రా లో ఫిర్యాదు చేశాం. హైడ్రా కమిషనర్ రెండుసార్లు పరిశీలించి వెళ్లి నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. - సీపీఎం నాయకుడు, చల్లా శోభన్

పోరాటాలను పట్టించుకోవడం లేదు

చెరువును కబ్జా నుంచి రక్షించాలని జాయింట్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం సమర్పిం చాం. కబ్జాకు గురవుతున్న ఈదులకుంటలో ప్రజలు ధర్నా లు చేస్తున్న అధికారులు స్పందించడం లేదు. కబ్జాదారులకు అధికారులు దాసోహం అయ్యారు. ప్రజా పోరాటాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. - సీపీఐ నాయకుడు రామకృష్ణ

ఓవర్ లాప్ అయ్యింది..

రెండు మండలాల మధ్య ఓవర్ లాప్ అయ్యింది. దీంతో ఈదులకుంట కబ్జా వ్యవహారం నిగ్గు తేల్చేందుకు రిపోర్ట్ రాశా. నిర్మాణదారులు సర్వే నివేదిక ఉందని చెబుతున్నారు. ఈ మేరకు డాక్యుమెంట్లు సమర్పించారు. ఇదే విషయంపై కూకట్పల్లి తహశీల్దార్.. తమ పరిధిలో లేదని, అదంతా శేరిలింగంపల్లి పరిధిలోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.- తహశీల్దార్ మహిపాల్ రెడ్డి

Next Story