- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిరాలం ట్యాంకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.430కోట్లు మంజూరు
బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్-44)ని చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా మిరాలం ట్యాంకు మీదుగా రూ.430 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గురువారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్-44)ని చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా మిరాలం ట్యాంకు మీదుగా రూ.430 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గురువారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మిరాలం ట్యాంకు సుందరీకరణలో భాగంగా లేక్ ఫ్రంట్ డవలప్ మెంట్ తోపాటు పర్యాటకంగాను అభివ్రుద్ధి చేయనున్నారు. ఈ వంతెనతోపాటు ప్రయాణీకులకు సమయం ఆదా చేయడంతోపాటు సమగ్రమైన పర్యాటక అభివ్రుద్ధిని ప్రమోట్ చేసేవిధంగా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టును హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీన్ని మూసీ సుందరీకరణలో భాగంగా పరిగణించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. అందుకే మూసీ రివర్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్)కు అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కూడా చేయాల్సి ఉందని, వీలైనంత త్వరలో భూసేకరణను పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. దీనికి ఈపీసీ మోడ్ లో టెండర్లు పిలవాలని, టెండర్లను పర్యవేక్షించడానికి, క్వాలిటీ చెకింగ్, క్వాలిటీ ఆడిట్ కోసం ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్(పీఎంసీ)ని సైతం నియమించుకోవాలని సూచించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ ను ఐఐటీ హైదరాబాద్/ఎన్ఐటీ వరంగల్/జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఆమోదం తీసుకోవాల్సిన బాధ్యత పీఎంసీపై ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను ప్రారంభించడానికి ఎంఆర్డీసీఎల్ ఎండీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






