- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖానామేట్ లో 15 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడిన రెవెన్యూ అధికారులు
మాదాపూర్ ఖానామేట్ లో 30 కోట్లు విలువ చేసే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు కాపాడారు.

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ ఖానామేట్ లో 30 కోట్లు విలువ చేసే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు కాపాడారు. ఈ భూమి చుట్టూ హైడ్రా అధికారులతో కలిసి ఫెన్సింగ్ వేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామేట్ విలేజ్‌లోని 41/12, 13, 14 సర్వే నంబర్లలో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమి తమదంటూ ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థ క్లైమ్ చేస్తూ వస్తోంది. ఆ భూములను ఖాళీ చేయాలని కోరుతూ 2016లో టీజీఐఐసీ అధికారులు ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఇట్టినా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలవరిస్తూ.. దశాబ్దం నాటి వివాదానికి తెరదించారు. మాజీ సైనికుల కోటా కింద ప్రభుత్వం 1963లో కేటియించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని.. పిటిషనర్ సమర్పించిన పట్టా పత్రాలు నకిలీవని రెవెన్యూ అధికారులు ఆధారాలతో కోర్టుకు నివేదించారు.
నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కొట్టేయాలని..
అప్పటి రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం 1978లో ఏర్పాటు కాగా.. ఆ కార్యాలయం పేరుతో 1972, 1973 సంవత్సరాలలో పట్టా పత్రాలు ఎలా వస్తాయని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. ఆర్‌వోఆర్ చట్ట ప్రకారం.. ప్రొసీడింగ్స్‌ను తహసీల్దార్ జారీ చేయాల్సి ఉండగా.. ఈ కేసులో రికార్డింగ్ ఆఫీసర్ యూడీఐఆర్ శేరిలింగంపల్లి మండలం పేరుతో జారీ అయ్యాయని.. ఇవి ఏ చట్టం కింద జారీ అయ్యాయో కూడా తెలియదన్నారు. ప్రొసీడింగ్స్ జారీ చేసిన అధికారి పేరు పి. నరసింహారావు అని ఉందని.. కానీ ఆ పేరుగల అధికారి అక్కడ పని చేసినట్టు రికార్డులు లేవని.. రుజువు చేశారు. ఇలా నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కొట్టేయాలని పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని కోర్టు నిర్ధారించింది.. ఆ భూములను వెంటనే రక్షించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భూమి రక్షించడం ఆనందంగా ఉంది: తహసీల్దార్ మహిపాల్ రెడ్డి
ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను విధుల్లో చేరిన కొద్ది రోజులలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రభుత్వ తరఫున పూర్తి స్థాయి ఆధారాలతో కౌంటర్ దాఖలు చేశామని అనంతరం అతి తక్కువ సమయంలోనే హైకోర్టు అనుకూల తీర్పు రావడం, దాని ఫలితంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని రక్షించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి స్వాధీనం, ఫెన్సింగ్ పనుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సర్వేయర్ సతీష్ రెడ్డి తో పాటు హైడ్రా అధికారులు పాల్గొన్నారు.






