- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షత్రియ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి పుట్టిన సంస్థ.. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు కీలక వ్యాఖ్యలు
కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం సందడిగా జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం సందడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో క్షత్రియ కుటుంబాలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. కార్యక్రమం ప్రారంభంలో కార్తీక మాస విశిష్టతను చాటి చెబుతూ ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటపాటల పోటీలు ఉత్సాహభరితంగా సాగగా, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సంప్రదాయ వంటకాలతో సజ్జమైన రుచికరమైన వనభోజనాన్ని ఆస్వాదిస్తూ పాల్గొన్న కుటుంబాలు ఆత్మీయంగా, ఆనందంగా గడిపారు.
ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్య సలహాదారు, శ్రీనివాసరాజు (IAS Retired) మాట్లాడుతూ, క్షత్రియ సేవా సమితి నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఇటువంటి ఆత్మీయ వేదికను ఏర్పాటు చేసిన సమితి అధ్యక్షుడు మైనర్ రాజును అభినందించారు. క్షత్రియ సేవ సమితి అనేది క్షత్రియ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి పుట్టిన సంస్థ అని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, ఆరోగ్యం, స్త్రీ సాధికారత, నిరుద్యోగులకు శిక్షణ, అనాథ-వృద్ధాశ్రమాల స్థాపన వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజం నుండి మన్ననలు పొందుతున్న సంస్థగా క్షత్రియ సేవాసమితిని గుర్తించారు.
ఇతర వక్తలు మాట్లాడుతూ సంఘ ఐక్యత, సంప్రదాయ సంస్కృతుల ప్రతిఫలంగా ఈ కార్యక్రమం నిలిచిందని అభినందించారు. ప్రతి ఏడాది ఇలాంటి ఆత్మీయ కలయికలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్టెక్స్ వర్మ, ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్ డైరెక్టర్ దండు శివరామరాజు, క్షత్రియ సేవా సమితి చైర్మన్ మైనర్ రాజు, మనోహర్ రాజు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






