ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ: హైడ్రా యాక్షన్ మోడ్

by Naga Rani Yarlagadda |

ఏదైనా సమస్య వస్తే మొదటగా స్థానికులు ఆశ్రయించేది స్థానిక ప్రభుత్వ శాఖ యంత్రాంగాన్నే. ఆయా ప్రభుత్వ శాఖ అధికారులు సమస్యల పట్ల స్పందించకపోయినా ఒకటికి రెండుసార్లు బాధితులు ఓపికగా అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చేవారు.

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ: హైడ్రా యాక్షన్ మోడ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఏదైనా సమస్య వస్తే మొదటగా స్థానికులు ఆశ్రయించేది స్థానిక ప్రభుత్వ శాఖ యంత్రాంగాన్నే. ఆయా ప్రభుత్వ శాఖ అధికారులు సమస్యల పట్ల స్పందించకపోయినా ఒకటికి రెండుసార్లు బాధితులు ఓపికగా అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చేవారు. నిన్నమొన్నటి వరకు ఇదే తంతు జరిగేది. కానీ ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు అనంతరం స్థానిక యంత్రాంగం పట్టించుకోకపోతే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. అది రోడ్డు సమస్య అయినా.. మురుగు నీటి సమస్య అయినా.. ప్రభుత్వ భూముల ఫిర్యాదులైన హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అత్యధికంగా ప్రభుత్వ భూములను సంరక్షించాలని మేడ్చల్ జిల్లా నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

విలువైన ప్రభుత్వ భూములు

హైదరాబాద్ మహా నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కొంత భాగం మేడ్చల్ జిల్లాకు వస్తుంది. అంతేకాకుండా రింగ్ రోడ్డుకు ఆనుకుని ఇరువైపులా ఇంతకు ముందు వరకు ఉన్న పలు మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ల పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. రోజురోజుకు రియల్‌ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కారిడార్ల నిర్మాణంతో ఇక్కడ ఉన్న భూములు విలువ కోట్ల రూపాయలకు చేరింది. దీంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై పడ్డారు. ఎడాపెడా దొంగ దస్తావేజులను సృష్టించి ప్రభుత్వ భూములు కొట్టేసే పనిలో నిమగ్నమయ్యారు.

పట్టనట్లు వ్యవహరిస్తున్న స్థానిక రెవెన్యూ

జిల్లా పరిధిలో కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాలలో అత్యధికంగా ప్రభుత్వ భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా ప్రభుత్వ భూములలో గత ప్రభుత్వ హయాంలో సింహభాగం కబ్జాకుగురవగా మిగిలి ఉన్న ప్రభుత్వ భూముల్లో సైతం కబ్జాయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. వీటిపై ఎప్పటికప్పుడు స్థానికులు ఆయా ప్రాంతాల్లో ఉన్న తహశీల్ధార్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్న అక్కడి రెవెన్యూ సిబ్బంది పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తుండడంతో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైడ్రాను ఆశ్రయిస్తున్న బాధితులు

ప్రభుత్వ భూములను సంరక్షించాలి అంటూ స్థానిక తహశీల్ధార్ కార్యాలయం నుంచి ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో పలువురు హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి సైతం భారీగా ప్రభుత్వ భూముల అంశంలో ఫిర్యాదులు ఇస్తున్నారు.

– 2024 జూలై 18న బాచుపల్లి ఎర్రకుంట చెరువులో వెలసిన భారీ అపార్ట్‌మెంట్ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.

– 2024 ఆగస్టు 4న గాజులరామారం రామన్న చెరువు శిఖం భూమితో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన 50 నిర్మాణాలకుపైగా కూల్చింది.

– 2024 సెప్టెంబర్ 8న మల్లంపేట కత్పచెరువు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన 14 ఇండిపెండెంట్ భవనాలను నేలమట్టం చేసింది.

– 2025 ఏప్రిల్ 24న సూరారం గ్రామంలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణం కూల్చివేసింది.

– 2025 మే 3న గాజులరామారం సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాలను తొలగించింది.

– 2025 మే 6న గాజులరామారం సర్వే నంబర్ 354 ప్రభుత్వ భూమి 15 ఎకరాలలో వెలసిన నిర్మాణాలను కూల్చివేసి స్వాధీనం చేసుకున్నది.

ఇవే కాకుండా అనేక ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంది.

పరిశీలనలో మరికొన్ని..

– గాజులరామారం సర్వే నంబర్ 307 స్టేట్ ఫైనాన్స్ ప్రభుత్వ భూములలో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ స్వయంగా పరిశీలించారు.

– భగత్‌సింగ్ నగర్ ధోబిఘాట్ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ పర్యటించి వివరాలు తెలుసుకున్నారు.

– బహదూర్‌పల్లి బొబ్బ ఖాన్ చెరువు కట్ట కాలువను ఆక్రమించి ప్రైమార్క్ నిర్మాణ సంస్థ చేపట్టిన నిర్మాణాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.

– గాజులరామారం సర్వే నంబర్ 12, 13, 127 ప్రభుత్వ భూములలో వెలసిన కేవీఎస్ ఫంక్షన్ హాల్, తత్వ గ్లోబల్ స్కూల్ అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

– పెట్‌బషీరాబాద్ సర్వే నంబర్ 25లో వినాయక నర్సరీ కబ్జా, 25/1, 25/2 లలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం పరిశీలించింది.

– వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాక్‌సాగర్ చెరువు, ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను హైడ్రా కమిషనర్ స్వయంగా పరిశీలించారు.

సోమవారం ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు

తాజాగా సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి పలు ఫిర్యాదులు అందాయి. కుత్బుల్లాపూర్ మండ‌లం సుభాష్‌న‌గ‌ర్‌ కొంప‌ల్లికి వెళ్లే 50 అడుగుల ర‌హ‌దారిని 100 అడుగుల మేర కొందరు ఆక్రమించడంతో అది 10 ఫీట్లకే ప‌రిమిత‌మైంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఎదురెదురుగా ఉన్న వారి ప్లాట్ల వ‌ల్ల ఇరువైపులా 20 అడుగుల చొప్పున క‌బ్జా చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ మండ‌లం గాజులరామారంలో స‌ర్వేనంబ‌ర్ 155లో ప్రభుత్వ ఆసుప‌త్రికి కేటాయించిన 3,500 గ‌జాల స్థలాన్ని క‌బ్జా చేస్తున్నార‌ని భ‌గ‌త్‌సింగ్‌న‌గ‌ర్ ప్రభుత్వ ఆసుప‌త్రి ల్యాండ్ ప్రొటెక్షన్ క‌మిటీ ప్రజావాణికి ఫిర్యాదు చేసింది. గ‌తంలో మున్సిపాలిటీ అధికారులు కూల్చేసినా దానిని మ‌ళ్లీ క‌బ్జా చేస్తున్నార‌ని పేర్కొంది. మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లా మేడిప‌ల్లి మండ‌లం చెంగిచెర్ల గ్రామంలో స‌ర్వే నంబ‌ర్ 33-10లో మొత్తం 13 ఎక‌రాల భూమి ఉండ‌గా అందులో 6 ఎక‌రాల్లో మాతా అర‌వింద్ కాల‌నీ ఉందని, మిగ‌తా 7 ఎక‌రాల‌ను సొంతం చేసుకున్న వ్యక్తి త‌మ‌ది దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉందంటూ అధికారుల‌కు ఫిర్యాదు చేసి రిజిస్ట్రేష‌న్లు అవ్వకుండా ఇబ్బందిపెడుతున్నార‌ని కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు. ఎవ‌రిది దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉందో తేల్చాల‌ని హైడ్రాను కోరారు.

Next Story