- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలి
సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

దిశ, సికింద్రాబాద్: సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్ అనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీ ఫిజిక్స్ విభాగంలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిశోధన ఫలాలు సాధారణ పౌరులకు, ముఖ్యంగా గిరిజనులను అందాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలిసి పనిచేయటం అత్యంత ముఖ్యమని.. అప్పుడే చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆరోగ్యం, వైమానిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... తద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు. ఓయూ ఫిజిక్స్ విభాగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ఓ వేదికగా మలచుకుని అనేక పరిశోధనలకు సంబంధించిన చర్చ జరగాలని, మరిన్ని నూతన ఆలోచనలకు అంకురార్పణ జరగాలని ఆకాంక్షించారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ... పరిశోధనల్లో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని అన్నారు. ఆధునిక సంకేతికాభివృద్ధిలో ఫిజిక్స్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. వైమానిక రంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణలను వివరించారు. బోయింగ్ లాంటి విమానాల తయారీలో మెటిరియల్ ఆవిష్కరణల కారణంగా, 700 టన్నుల బరువుండాల్సిన విమానాలు అదే సామర్ధ్యంతో 350 టన్నులతో నిర్మించిన విమానాలు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతలో ఫిజిక్స్ ఆవిష్కరణలు అగ్రగామిగా ఉంటాయని తెలిపారు. స్మార్ట్ మెటీరియల్ ఆవిష్కరణల ద్వారానే మార్కెట్ పరివర్తనను అందుకోవచ్చని అన్నారు. కొత్త ఆలోచనలు, విమర్ళనాత్మక దృక్పథం, ఆవిష్కరణల దిశగా ప్రయత్నించటం ద్వారా యువ పరిశోధకులు అద్భుతాలు సృష్టించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. విజయ్ మాట్లాడుతూ.. 21వ శతాబ్దం మెటీరియల్ విప్లవానికి సూచికగా నిలుస్తుందని అన్నారు. నూతన మెటీరియల్ ఆవిష్కరణలు భవిష్యత్తు ఆధునిక సమాజంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేశారు. సరికొత్త ఆవిష్కరణల మార్గంలో... స్థిరత్వం, పర్యావరణ అనుకూలత దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పునరుత్పాదక విధానాలపై దృష్టిపెట్టాలని... ప్రస్తుత ఎలక్ట్రిక్ ప్రపంచంలో బ్యాటరీ అప్లికేషన్స్, సెల్ఫ్ క్లీనింగ్ అప్లికేషన్స్, హైడ్రోజన్ కేంద్రక పరిశోధనల్లో ఉన్న అవకాశాలను వివరించారు.
ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండి) హైదరాబాద్ డైరెక్టర్ ధీరజ్ పాండే మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త ఆవిష్కరణల దిశగా పరిశోధనలు జరగాలన్నారు. వేగంగా జరుగుతున్న సాంకేతికాభివృద్ది లో ఫిజిక్స్ పరిశోధనలు ముందువరుసలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్, ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ ,రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేంద్ర కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






