ప్రాంతీయవాదం అనేది జాతీయ వాదానికి వ్యతిరేకం: ఎమ్మెల్సీ కోదండరాం

by Kodari Anjali |   (  Updated:2026-06-13 12:49:34  IST  )

ప్రాంతీయవాదం అనేది జాతీయ వాదానికి వ్యతిరేకం, ఈ రెండింటికి మధ్యన ఘర్షణ ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

ప్రాంతీయవాదం అనేది జాతీయ వాదానికి వ్యతిరేకం: ఎమ్మెల్సీ కోదండరాం
X

దిశ, రాంనగర్: ప్రాంతీయవాదం అనేది జాతీయ వాదానికి వ్యతిరేకం, ఈ రెండింటికి మధ్యన ఘర్షణ ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మేం ప్రాంతీయ వాదం కాదు జాతీయవాదం అంటున్నారని, కానీ తెలంగాణ వాదం కూడా జాతీయవాదానికి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ తన ప్రాంతాన్ని తాను కాపాడుకుంటూ భారతదేశం గొప్పతనం అభివృద్ధి కోసం, కీలకమైన ఒక భాగంగా బతకాలని తెలంగాణ ప్రయత్నం చేసిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్, బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుండ యాదగిరి పటేల్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, పలువురు ఉద్యమకారులు, నాయకులు హాజరై పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు.

సంస్కృతిని, యాస భాషను కాపాడుకుంటాం..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు గుండ యాదగిరి తెలంగాణ కోసం ఏదైనా చేయాలని ఎంతో తాపత్రయపడి, నిబద్ధతతో క్రియాశీలకంగా పనిచేశారని కొనియాడారు. ఇవాళ తామందరం కూడా తెలంగాణ లక్ష్యసాధన కోసం పనిచేయాలని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులు చేసుకున్నటువంటి దోపిడి దౌర్జన్యం, ఆధిపత్యంకారణంగానే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తమ సంస్కృతిని, యాస భాషను కాపాడుకుంటామన్నారు. ఇక్కడి వనరులు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. ఈ కార్యక్రమంలో టియుజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాం రెడ్డి, తెలంగాణ జన సమితి హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య గౌడ్, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి నాయకులు పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story