మెడికల్ షాపులో కాల్పులు.. ఒకరు మృతి

by Naga Rani Yarlagadda |

పట్టపగలే మెడికల్ స్టోర్ లోకి చొరబడిన దుండగులు.. అక్కడి సిబ్బందిపై కాల్పులు జరిపారు.

మెడికల్ షాపులో కాల్పులు.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టపగలే మెడికల్ స్టోర్ లోకి చొరబడిన దుండగులు.. అక్కడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. చండీగఢ్ లోని సెక్టార్ 11లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు కుమార్ మెడికోస్ స్టోర్ లోకి చొరబడి జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల క్యాషియర్ మరణించాడు. మృతుడిని జాంకీ దాస్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ముగ్గురు అనుమానితులు బైక్ పై సమీపంలోని మార్కెట్ కు చేరుకున్నారు. వారిలో ఇద్దరు ముసుగు వేసుకుని, తుపాకులతో మెడికల్ స్టోర్‌లోకి ప్రవేశించగా, మూడో వ్యక్తి బయట కాపలా ఉన్నాడు. స్టోర్‌లోకి రాగానే నేరుగా కౌంటర్ వద్ద ఉన్న జాంకీ దాస్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాంకీ దాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే పీజీఐఎంఈఆర్ (PGIMER) ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడినట్లు సమాచారం.

13 రౌండ్ల కాల్పులు: ఎస్ఎస్పీ సుమేర్ ప్రతాప్ సింగ్

ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) సుమేర్ ప్రతాప్ సింగ్ స్పందిస్తూ.. "మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు వచ్చి జాంకీ దాస్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 13 రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు గుర్తించాం. ఇప్పటివరకు మాకు ఎటువంటి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆధారాలు లేవు, కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం" అని వెల్లడించారు. నిందితుల కోసం నగరమంతా పోలీసులు గాలిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మెడికల్ స్టోర్, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story