శంషాబాద్ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు

by velandi.Saikiran |   (  Updated:2026-06-12 22:01:14  IST  )

శంషాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శంషాబాద్ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 111 జీఓ పరిధిలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలకు సైతం ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారని చెబుతున్నారు. అక్రమ నిర్మాణదారులు ఇష్టారాజంగా వ్యవహరిస్తున్న అడిగే నాథుడు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారి పక్కనే కన్వెన్షన్ హాల్..

శంషాబాద్ పట్టణంలోని తొండుపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి భారీ ఎత్తున కన్వెన్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆరు నెలలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్న నిర్మాణాలను పట్టించుకోని అధికారులు ఇతర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను ఎలా అడ్డుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు..

శంషాబాద్‌లో నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే నిబంధనల ప్రకారం నిర్మాణాలకు అనుమతి ఉండగా, ఇతర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఫ్లాట్లు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ‘మేనేజ్‌మెంట్’ సంస్కృతి నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా చిన్నచిన్న ఫ్లాట్లలో కూడా నిర్మాణదారులు నాలుగైదు అంతస్తులు నిర్మిస్తున్నారని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వసూల్ రాజాలుగా అవుట్‌సోర్సింగ్ సిబ్బంది?..

టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కలెక్షన్ కింగ్స్‌గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణాల పరిమాణాన్ని బట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శంషాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పట్టించుకోని ఏసీపీ..

శంషాబాద్ సర్కిల్ ఏసీపీ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఉత్సవమూర్తిగా పనిచేస్తున్నారని క్షేత్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఏసీపీ, అదేవిధంగా టీపీఎస్ దృష్టి సారించకపోవడంతో విభాగంలో పనిచేసే కొందరు అడ్డగోలుగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Next Story