- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ బస్సు భద్రమేనా? మృత్యుశకటాలుగా ఆటోలు, ప్రైవేట్ వ్యాన్లు
స్కూలు విద్యార్థులకు తీసుకెళ్లే బస్సులు భద్రమేనా? అనే సందేహం అందరిలోనూ కలుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్కూలు విద్యార్థులకు తీసుకెళ్లే బస్సులు భద్రమేనా? అనే సందేహం అందరిలోనూ కలుగుతున్నది. ఆటోలు, ప్రైవేట్ వ్యాన్లు సైతం పెను ప్రమాదంగా మారుతున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంతో పాటు జిల్లాల్లోనూ ఆటోలు, చిన్న ప్రైవేట్ వ్యాన్లలో పిల్లలను స్కూళ్లకు చేరవేస్తున్నారు. ఓనర్లు కొద్దిపాటి లాభం కోసం సామర్థ్యానికి మించి ఊపిరి ఆడనంతగా విద్యార్థులను కుక్కి మరీ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆటో వెనక భాగం, డ్రైవర్ సీటుకు ఇరువైపులా పిల్లలను కూర్చోబెట్టి, స్కూల్ బ్యాగులను బయటకు వేలాడదీస్తూ ప్రమాదకరంగా నడుపుతున్నారు. నలుగురు లేదా ఐదారుగురు ఎక్కాల్సిన ఆటోలో కనీసం 10 మందికి పైగా తీసుకెళ్తున్నారు. చిన్నపొరపాటు లేదా ప్రమాదం జరిగినా పసిప్రాణాలు గాల్లో కలసిపోయే ప్రమాదం ఉంది. ఈనెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా రవాణా శాఖ రంగంలోకి దిగి నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థల వాహనాలపై చర్యలకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25,987 విద్యాసంస్థల బస్సులు ఉండగా, ఇప్పటివరకు 22,158 బస్సులు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 625 బస్సులు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 531 బస్సులు, ఖమ్మం జిల్లాలో 168 బస్సులు, హైదరాబాద్ జిల్లాలో 165 బస్సులు ఇప్పటికీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంది.
15 నుంచి స్పెషల్ డ్రైవ్
స్కూళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులను రవాణా చేసే అన్నిరకాల విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జూన్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్, పర్మిట్, బీమా, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లు ఉండాలి. డ్రైవర్లకు సరైన డ్రైవింగ్ లైసెన్స్, తగిన అనుభవం ఉండాలి. విద్యార్థుల భద్రత కోసం అటెండర్‌ను నియమించాలి. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూడదు.
తల్లిదండ్రుల తప్పు కాదా?
స్కూల్ ఫీజుల విషయానికి వస్తే రూ.వేలకు వేలు రాజీ పడకుండా చెల్లించే తల్లిదండ్రులు.. పిల్లల ప్రయాణ భద్రతపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మింగుడుపడని ప్రశ్న. తమ పిల్లలు వెళ్లే ఆటోలో ఓవర్ లోడింగ్ కారణంగా ప్రమాదం పొంచి ఉందని తెలిసినా, అదే వాహనాల్లో పంపించడం ముమ్మాటికీ తల్లిదండ్రుల తప్పేనని విద్యారంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. భారీగా ఫీజులు వసూలు చేసే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు సైతం తమ విద్యార్థులు బడికి ఎలా వస్తున్నారో గమనించాలని, తల్లిదండ్రులతో మాట్లాడి సురక్షిత ప్రయాణాలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
యాజమాన్యాలదే పూర్తి బాధ్యత
ఫిట్‌నెస్ లేకుండా నడిచే, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకునే స్కూలు బస్సులు, ఇతర వాహనాలను సీజ్ చేస్తాం. మోటార్ వాహనచట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు, విద్యాసంస్థల యజమానులపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల భద్రత బాధ్యత యాజమాన్యాలదే. రాష్ట్రవ్యాప్తంగా 25,987 విద్యాసంస్థల బస్సులు ఉండగా శుక్రవారం నాటికి 22,158 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ పొందాయి. మిగిలిన 3,829 బస్సులకు సైతం ఫిట్ నెస్ పరీక్షలు చేయించాలి. లేదంటే ఆ బస్సులను రోడ్లపైకి రానివ్వం.
-చంద్రశేఖర్ గౌడ్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్






