రాచకొండ పోలీసుల సరికొత్త చొరవ.. 30 రోజుల్లో వారెంట్స్ క్లియరెన్స్

by Naga Rani Yarlagadda |

రాచకొండ పోలీసులు సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న నేరస్తులకు..

రాచకొండ పోలీసుల సరికొత్త చొరవ.. 30 రోజుల్లో వారెంట్స్ క్లియరెన్స్
X

దిశ, సిటీక్రైం : రాచకొండ పోలీసులు సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న నేరస్తులకు సంబంధించిన ఎన్‌బీ‌డబ్ల్యూ (నాన్ బెయిలబుల్) వారెంట్‌ల సంఖ్యను జీరో కు తీసుకువచ్చేందుకు కసరత్తు చేశారు. కేవలం 30 రోజులలో 2847 పెండింగ్ ఎన్‌బీ‌డబ్ల్యూ వారెంట్‌లను వివిధ కేసులలో ఉన్న అనుమానితులు, నిందితులకు చేరేలా చేసి వాటిని జీరో స్థాయికి తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. పోలీసు కమిషనర్ సుధీర్ బాబు సారథ్యంలో ఈ పెండింగ్ ఎన్‌బీ‌డబ్ల్యూ వారెంట్‌లను క్లియర్ చేసేందుకు ఓ ప్రణాళిక ప్రకారం వాటిని అమలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప్పల్ లోని ఓ హోటల్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.

పోలీసుల యాక్షన్ ప్లాన్ ఇలా..

ఈ సంవత్సరం ప్రారంభంలో వివిధ కేసులకు సంబంధించి నేరస్తులు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న వారు 1088 మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. అది ఏప్రిల్ నాటికి 2847 వరకు పెరిగింది. దీంతో వారిని విచారణ ఎదుర్కొనేలా చేయాలని, వారి ఆచూకీని గుర్తించాలని పోలీసులు సిద్ధమయ్యారు. దీని కోసం మొత్తం 9 స్పెషల్ టీం లను ఏర్పాటు చేశారు. ఈ టీం లలో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్ ఉంటారు. ముందుగా పెండింగ్ వారెంట్ లను 7 కేటగిరీలలో విభజించుకున్నారు. అందులో లాంగ్ పెండింగ్, సాధారణన (నాన్ గ్రేవ్) , సంచలనం రేపిన (గ్రేవ్) కేసులు డివైడ్ చేశారు. కమిషనరేట్ పరిధిలో ఇతర కమిషనరేట్ లు, రాష్ట్రం, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ కేసులను వేరుగా చేశారు. ఇలా చేసి 30 రోజులలో మొత్తం 1933 ఎన్‌బీ‌డబ్ల్యూ వారెంట్ లను ఎక్సిక్యూట్ చేశారు. మిగతా 823 ఎన్‌బీ‌డబ్ల్యూ వారెంట్‌లను కోర్టుకు సమర్పించారు. ఈ వారెంట్ లకు సంబంధించిన షూరిటీదారులకు నోటీసులు ఇవ్వాలని, అలాగే బీఎన్ఎస్ఎస్ 84, 84 ప్రోసీడీంగ్స్, సీఆర్ పీసీ 82,83 ల ప్రకారం ప్రోక్లెమేషన్, నిందితుల ఆస్తులకు సంబంధించిన అటాచ్‌మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు పోలీసులు నివేదించారు. ఇలా మొత్తం పెండింగ్ లో ఉన్న 2847 వారెంట్ లను పోలీసులు అమలు చేశారు.

ఫలితాలు ఇలా..

- 2023 సంవత్సరంలో జారీ అయిన ఈ - వారెంట్‌లను నిందితులను గుర్తించి వారికి అందించారు.

- పెండింగ్ లో ఉన్న వారెంట్ లలో 52 మంది మరణించినట్లు గుర్తించారు. దీంతో మిగతా నేరస్తులతో విచారణను కొనసాగించాలని కోర్టుకు విజ్ణప్తి చేశారు.

- 14 మంది నేరస్తులు వివిధ ప్రాంతాల్లో ఇతర జైళ్ళలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వారెంట్‌లను సంబంధిత కోర్టు ముందు పొందుపర్చడంతో వారి విచారణకు అడ్డంకులు లేకుండా చేశారు.

- పరారీలో ఉన్న 13 మందికి వారెంట్‌లను అందించడంతో వారి కేసుల విచారణ వేగవంతం కానున్నాయి.

- నులుగురు నిందితులు వివిధ రాష్ట్రాల్లోని నార్కోటిక్ కేసులలో ఉన్నట్లు తేలింది. వారికి వారెంట్ లు అందజేయడంతో వారి కేసులలో కోర్టు విచారణ ప్రారంభం కానుంది.

- ఈ వారెంట్ లను అందజేయడంతో వివిధ కేసులలో ఉన్న వారందరూ కోర్టు ముందు హాజరై విచారణకు సహాకరించనున్నారు.

- లాంగ్ పెండింగ్ లో ఉన్న ఎన్‌బీ‌డబ్ల్యూ వారెంట్‌లకు సంబంధించిన నేరస్తులకు బెయిల్ ఇవ్వకుండా కోర్టు విచారణను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు న్యాయమూర్తులను కోరారు.

- పెండింగ్ లేకుపోవడంతో తాజాగా వచ్చే వారెంట్‌లను తక్షణమే నిందితులకు అందేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

- కొన్ని కేసులలో నిందితులకు సంబంధించిన షూరిటీల అంశాల్లో లోపాలను పోలీసులు గుర్తించారు. ఇలా చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

- కోర్టు విచారణకు ఇక అడ్డంకులు ఉండవు. ఈ వారెంట్ లను అందించడంతో వారంతా కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.

- కోర్టు విచారణకు నిందితులు హాజరవడంతో వేగవంతంగా విచారణ పూర్తయ్యి నిందితులకు శిక్షలు పడే అవకాశం పెరుగుతుంది.

- పాత పెండింగ్ కేసుల సంఖ్య తగ్గిపోతుంది. కోర్టుల పై భారం తగ్గుతుంది.

నేరస్తుల్లో భయం కలుగుతుంది - సుధీర్ బాబు, పోలీసు కమిషనర్, రాచకొండ

ఎన్‌బీ‌డబ్ల్యూ వారెంట్‌లను క్లియర్ చేసేందుకు తాము తీసుకుంటున్న చర్యల వల్ల విచారణలు వేగవంతంగా పూర్తవుతాయి. ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం, బాధితులు, ఫిర్యాదుదారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోలీసుల్లో జవాబుదారితనం పెరుగుతుంది. తప్పించుకుని తిరగాలనే నేరస్తుల్లో భయం కలుగుతుంది. నేర నియంత్రణకు తోడ్పడుతుంది. కోర్టులు, పోలీసుల మధ్య సమన్వయం పెరిగి క్రిమినల్స్ కు శిక్షలు ఖరారు కావడంలో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.

Next Story