- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంపాపేట్‌లో నీటి వృథా.. చెత్త సమస్యలపై ప్రజల ఆగ్రహం
నీటి వృథాగా పోతున్న ఘటన చంపాపేట్‌లో చోటు చేసుకుంది.

దిశ, చంపాపేట్: ఒకవైపు తాగునీటి కొరత, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు చంపాపేట్ పరిధిలో మాత్రం ప్రతిరోజూ వందల లీటర్ల మంచినీరు రోడ్లపై వృథాగా పారుతున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం వహిస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలనీ విద్యాబోధిని స్కూల్ గల్లీలో ప్రతి రోజు ఇళ్ల నుంచి వాడిన నీటిని నేరుగా రోడ్లపైకి వదులుతుండటంతో వీధులు ఎప్పుడూ తడిగా మారుతున్నాయి. రోడ్డు మధ్యలో డ్రైనేజీ మూత ఉన్నప్పటికీ, నీరు వెళ్లేలా సరైన ఏర్పాటు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. దీనివల్ల దోమలు, దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చంపాపేట్ మహంకాళి తోట నుంచి గాంధీబొమ్మ వరకు, చిలకల బస్తి, దాసరి బస్తి, సుల్తాన్ వాల్వా, ఎస్‌బీఐ కాలనీ, రాజిరెడ్డి నగర్, నేతాజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు.
పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో విఫలం..
కొందరు ఇళ్ల ముందు రోడ్లనే నీటి గొట్టాలతో కడుగుతుండటంతో రహదారులు దెబ్బతిని గుంతలు ఏర్పడుతున్నాయని, చివరకు ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ వర్క్స్ అధికారులు ఎప్పుడైనా ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారా? జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం ఈ సమస్యలను గుర్తించలేదా? ప్రజల పన్నుల డబ్బుతో వేసిన రోడ్లు దెబ్బతింటుంటే బాధ్యత ఎవరిది? భూగర్భ జలాలను కాపాడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. నీటి వృథాతో పాటు చెత్తను కూడా కొందరు రోడ్లపైనే వేస్తుండటంతో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇంటి యజమానులు తమ అద్దెదారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నీటిని వృథా చేసే వారిపై చర్యలు తీసుకుంటారా? లేక సమస్య మరింత తీవ్రమయ్యే వరకు వేచి చూస్తారా? అనే ప్రశ్నకు ప్రజలు సమాధానం కోరుతున్నారు. అలాగే నీటి వృథా నివారణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెత్త నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.






