అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

by Naveena |

హైదరాబాద్ సరూర్‌న‌గర్‌లో యువతి అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
X

దిశ, చైతన్య పురి : హైదరాబాద్ సరూర్‌న‌గర్‌లో యువతి అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ తన భార్య, కూతురితో కలిసి సరూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉండేవాడు. స్థానికంగా మైసమ్మ దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. పూజారి పనులతో పాటు కాంట్రాక్టర్ గా పని చేసేవాడు. చెన్నై కి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివాసం ఉండేది. అయితే అప్సర పలు సినిమాలు, సీరియల్స్ లలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో పూజారి సాయికృష్ణ పనిచేసే మైసమ్మ ఆలయానికి అప్సర వస్తుండేది. సాయికృష్ణ, అప్సరల పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో తనను పెళ్లిచేసుకోవాలని సాయికృష్ణ ను అప్సర ఒత్తిడి చేసేది. ఒత్తిడి తట్టుకోలేక ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని పూజారి సాయికృష్ణ పథకం రచించాడు.

2023 జూన్ 3న కోయంబత్తూరు పోదామని చెప్పి అప్సరను కారులో తీసుకుని వెళ్ళాడు. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి లోని గోశాల సమీపంలోని సిసి కెమెరాలు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అప్పటికే నిద్రపోతున్న అప్సర ముఖంపైన కారుపై కప్పే కవర్ తో ఊపిరి ఆడకుండా చేస్తుండగా అప్సర ప్రతిఘటించింది. వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో.. అక్కడికక్కడే మృతి చెందింది. అప్సర మృతదేహాన్ని కారు బాడీ కవర్ లో చుట్టి డిక్కీలో వేసుకొని తన ఇంటివద్దకు వచ్చాడు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్నగర్ తహసిల్దార్ కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురు గురించి ప్రశ్నించగా ..స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్ళిందని తానే శంషాబాద్ లో ఆమె స్నేహితుల కార్ లో ఎక్కించినట్లు నమ్మబలికాడు. తరువాత పలుమార్లు ఫోన్ చేసిన స్పందించలేదని చెప్పాడు. ఏమీ తెలియనట్టు తల్లితో కలిసి శంషాబాద్ ఆర్ జి ఐ ఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట్లాడే మాట తీరుపై అనుమానం కలిగి పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా 11వ అడిషనల్ సెషన్స్ జడ్జి వై. జయప్రసాద్ నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించారు. మృతురాలి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం అందిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. రవికుమార్ తమ వాదనలు వినిపించారు.

Next Story