పోలీసుల అక్రమ వసూళ్లు.. బీఆర్ఎస్ నాయకుడు ఇర్ఫాన్ ఆరోపణ

by Batti.Sumithra |

ధన్వాడ పోలీస్ స్టేషన్ ఎదుట జరుగుతున్న వాహన తనిఖీల పేరుతో రైతులు, చిరు వ్యాపారులు, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ధన్వాడ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఇర్ఫాన్ ఆరోపించారు.

పోలీసుల అక్రమ వసూళ్లు.. బీఆర్ఎస్ నాయకుడు ఇర్ఫాన్ ఆరోపణ
X

దిశ, ధన్వాడ : ధన్వాడ పోలీస్ స్టేషన్ ఎదుట జరుగుతున్న వాహన తనిఖీల పేరుతో రైతులు, చిరు వ్యాపారులు, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ధన్వాడ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఇర్ఫాన్ ఆరోపించారు. మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. బీసీ కాలనీ, లక్ష్మీవాడ ప్రాంతాల నుంచి బస్టాండ్‌కు వ్యాపార అవసరాల కోసం వచ్చే చిరు వ్యాపారులు, పొలాలకు వెళ్లే రైతుల ద్విచక్ర వాహనాల ఫొటోలు తీసి, వారిపై జరిమానాలు విధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ప్రజల భద్రత కోసం చేపట్టే తనిఖీలు ప్రజలకు భారంగా మారకూడదని, రైతులు, చిరు వ్యాపారులు, పేదలను వేధించే విధంగా వ్యవహరించడం సరికాదని ఇర్ఫాన్ అన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎస్‌ఐ మల్లేశ్వరును 'దిశ' వివరణ కోరగా, వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను మాత్రమే వసూలు చేస్తున్నామని, ఇందులో ఎలాంటి తప్పు లేదని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ చలానాలతో పాటు హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించడం సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు. "దీనినే అక్రమ వసూళ్లు అంటారా?" అని ఎస్‌ఐ ప్రశ్నించారు.

Next Story