పోలీసు బాసుల పంతం.. డ్రైవర్లకు ప్రాణ సంకటం

by Yella Dhawani Reddy |

రోడ్లపై వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తుంటే.. మరోవైపు పోలీసులే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

పోలీసు బాసుల పంతం.. డ్రైవర్లకు ప్రాణ సంకటం
X

దిశ, సిటీ క్రైం : రోడ్లపై వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తుంటే.. మరోవైపు పోలీసులే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సాధారణ వాహనదారులు వేగం మీరితే చలాన్లు వేసే పోలీసులే రయ్..రయ్‌మంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారన్న న్యూస్ తాజాగా మోటర్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో హాట్ టాపిక్‌‌గా మారింది. కొందరు అధికారులు వాహనాల స్పీడ్ లిమిట్‌ను బ్రేక్ చేస్తున్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. పోలీసు శాఖల్లోని కొందరు ఉన్నతాధికారులు తమ వాహనాన్ని స్పీడ్‌గా డ్రైవ్ చేయాలని ఇస్తున్న ఆదేశాలు డ్రైవర్‌లను పరేషాన్ చేస్తున్నాయి. 160 కిలో మీటర్‌ల వేగంతో వెళ్లినా ఆ స్పీడ్ సరిపోవడం లేదని ఇంకా పెంచాలని పోలీసు బాసులు గాబరా పెడుతున్నట్టు తెలుస్తోంది.

జిల్లాల నుంచి వచ్చే క్రమంలో..

ముఖ్యంగా జిల్లాల నుంచి వచ్చే కొందరు ఐపీఎస్ హోదా కలిగిన అధికారులు పంతం పట్టి మరీ హైవేలపై వేగాన్ని పెంచాలని చెప్తుండటంతో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. స్పీడ్‌తో డేంజర్ అని చెప్పినా కొంతమంది బాసులు డొంట్ కేర్ అంటున్నారని ఎంటీవో సెక్షన్ వర్గాల్లో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా భార్య, పిల్లలు ఉంటారని, ప్రమాదాలు జరిగితే వారంతా రోడ్డు మీద పడాల్సి వస్తుందని వాపోతున్నారు. తాము బిక్కుబిక్కుమంటూ దేవుడిపై భారం వేసి వేగంగా నడపాల్సి వస్తోదని చెప్తున్నారు. 300 నుంచి 400 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకోవాలంటూ ఒత్తిడి చేసే ఓ ఆఫీసర్ వ్యవహార శైలి నరకప్రాయంగా మారిందని ఎంటీవో వర్గాల్లో చర్చ సాగుతోంది.

120 కి.మీ. వేగం వల్లే ఆ ప్రమాదం

జులై 26వ తేదీన తెల్లవారుజాము 4.45 నిమిషాలకు చౌటుప్పల్ కైతాపురం వద్ద జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణమని ఇప్పటికే అధికారులు తేల్చారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావులు మృతిచెందగా, అడిషనల్ ఎస్పీ కేవీఎస్ ప్రసాద్, డ్రైవర్ నర్సింగ్‌రావులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదాన్ని విశ్లేషించిన పోలీసులు ప్రమాదానికి ప్రధాన కారణం 120 కిలో మీటర్‌ల వేగమేనని తేల్చారు.

Next Story