- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రపంచస్థాయి నగరంలో ఇలాగేనా..?
దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మబ్బులు కనబడితే ప్రజలు వణుకుతున్నారు. గతంలో ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వరద నీటి సమస్య, డ్రైనేజీ లీకై రోడ్లపై పారడం సర్వసాధారణమైంది. చాలా ప్రాంతాల్లో చినుకుపడితే వరద నీరు ముంచెత్తుతోంది. బస్తీలలో ఇండ్లు నీట మునుగుతున్నాయి. నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీనికి కారణం ఏమిటనేది ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాలలో నిజాం కాలంలో నాటి డ్రైనేజీ వ్యవస్థనే కొనసాగుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టిసారించడం లేదని గ్రేటర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు క్రమక్రమంగా కబ్జాలకు గురికావడం, ఆక్రమణల గురించి తెలిసినప్పటికీ ఉన్నతస్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ అధికారులు ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కు తగ్గుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై దృష్టిసారించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం కబ్జాదారుల పాలిట వరంగా మారగా ప్రజలపాలిట శాపంగా పరిణమించింది.
ఏరులై పారుతున్న మురుగు..?
జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలు, బస్తీలు, ప్రధాన రోడ్లపై మురుగు పారడం సర్వసాధారణమైంది. కొన్ని చోట్ల ప్రజల అవసరాల మేరకు డ్రైనేజీ పైపులు లేకుండాపోవడంతో నిత్యం లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరమ్మతులు చేసిన గంటల వ్యవధిలోనే తిరిగి సమస్య ఉత్పన్నమౌతోంది. దీంతో రోడ్డుపై నడిచి వెళ్లలేని విధంగా పరిస్థితులు మారుతున్నాయి. వాహనాలు అందులో నుంచి ప్రయాణిస్తున్న సమయంలో పాదచారులపై మురుగు పడుతోంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు శాశ్వత పరిషస్కారం చూపడం లేదనే ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు నాలాల విస్తరణ, సమగ్ర అభివృద్ధికి గతంలో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది. అవసరమైతే కొత్త చట్టం తీసుకువస్తాం, దశాబ్దాలుగా నాలాలు కుచించుకుపోయాయి, వాటన్నింటిని పునరుద్దరిస్తామని, నాలాల కబ్జాలను సహించేది లేదు అని ప్రభుత్వాలు ప్రకటించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు.
ప్రపంచస్థాయి నగరంలో ఇలాగేనా..?
నగరాన్ని వరదలు ముంచెత్తిన వెంటనే ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని, నాలాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టాం, ముంపునకు నాలాల కబ్జాలే కారణమంటూ అధికారులు రివ్యూ మీటింగుల్లో కిందిస్థాయి సబ్బందిని కడిగిపారేసే అధికారులు కూడా సమస్యలపై ఏమాత్రం దృష్టిపెట్టడం లేదనేది ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామని ప్రకటన చేయడం అందరి దృష్టిని అటువైపు మళ్లిస్తోంది.
చెరువులు, కుంటలలో బహుళ అంతస్థుల భవనాలు..
ఒకప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ వందలాది చెరువులు, కుంటలు ఉండేవి. వీటిని ఆక్రమిస్తూ బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులు నాలాలను సైతం వదలడం లేదు. కొన్నిచోట్ల నాలాలకు అడ్డుగా నిర్మాణాలు చేపట్టడంతో మురుగునీరు, వర్షపు నీరు వెళ్లకుండా రోడ్లను ముంచెత్తుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చేష్టలుడిగిపోవడంతో నగరంలో చిన్నపాటి వర్షాలకు కూడా వరద నీరు రోడ్లపై చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిజాం కాలంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్తను ఆధునీకరించి మరిన్ని డ్రైనేజీలను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.