- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ మామిడి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీపీ సజ్జనార్
వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయనే నిజాన్ని ప్రజలు విస్మరించకూడదని నగర సీపీ సజ్జనార్ అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయనే నిజాన్ని ప్రజలు విస్మరించకూడదని నగర సీపీ సజ్జనార్ అన్నారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని, సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని.. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదని.. కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని తెలిపారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని సీపీ గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలపారు. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరారు. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని , పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలన్నారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100 కు లేదా హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212 కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ ఆ పోస్ట్ లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






