- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత ఇంటికి కొత్త రూపం.. ఆధునిక హంగులతో అందంగా ముస్తాబు!
స్వల్ప మార్పులతో పాత ఇళ్లు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. కొత్తగా కనిపించేలా డెకరేషన్, ఎలివేషన్ నిర్మాణాలు ఇటీవల ఊపందుకున్నాయి. కంప్యూటర్ సాయంతో నిర్మాణ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో : తరం మారుతోంది. కాలం మారుతోంది. వీటితోపాటు ఇళ్ల యజమానుల అభిరుచులు సైతం మారుతున్నాయి. పాత డిజైన్ల స్థానంలో కొత్తవి వస్తున్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన వాటికి ఆధునిక సొబగులు అద్దుతు అన్ని రకాల వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. డెకరేషన్లు, ఎలివేషన్ల వంటి మార్పులతో ఒకప్పటి పాత ఇళ్లు సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి.
విభిన్న రకాల డిజైన్లు..
గతంలో నిర్మించిన ఇళ్లలో గదుల సంఖ్య, వసతులపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పుడున్నన్ని రకాల డిజైన్లు గతంలో లేవు. ఇంటీరియర్, ఎలివేషన్, బయట హంగులు, సుందరీకరణపై పెద్దగా శ్రద్ద పెట్టేవారు కాదు. బయట నుంచి ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ వసతుల విషయంపై ఎక్కువగా దృష్టి సారించేవారు కాదు. ఈ నేపథ్యంలో కొత్త తరహాలో నిర్మించిన ఇళ్ల మధ్య పాతవి బోసిపోతున్నాయి. దీంతో నగరవాసులు ఇంటి మరమ్మతులపై దృష్టి సారించారు. నేడు లోపలి వసతులే కాదు.. ఇంటి బాహ్య అలంకరణపైనా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణాల్లో రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కొందరు గతంలో నిర్మించిన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు కొత్తగా మార్పులు చేయిస్తున్నారు.
కంప్యూటర్ సాయం..
స్వల్ప మార్పులతో పాత ఇళ్లు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. కొత్తగా కనిపించేలా డెకరేషన్, ఎలివేషన్ నిర్మాణాలు ఇటీవల ఊపందుకున్నాయి. కంప్యూటర్ సాయంతో నిర్మాణ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. త్రీడీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నిర్మాణం జరగకుండానే ఇళ్లు కళ్ల ముందే కదలాడుతోంది. గదుల సంఖ్య, వసతులే ప్రధానంగా గతంలో నిర్మాణాలు చేయగా, అనూహ్యమైన హంగులు వచ్చాయి. ఒకప్పుడు ఆరు బయట ఉండే బాత్రూం, కిచెన్ సౌకర్యాలు ప్రస్తుతం ఇంటి లోపలికి వచ్చి చేరాయి. బయట అందానికి ప్రాధాన్యత పెరగడంతో కాస్త ఖర్చయినా సరే మార్పులు చేయించుకునేందుకు యాజమానులు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
సాంకేతికతకు పెద్దపీట..
అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సహకారంతో ప్రస్తుతం విభిన్న డిజైన్లలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా నిర్మించే వాటికైతే డిజైన్ ఇస్తే చాలు.. యజమానులు కోరుకున్న విధంగా రూపునిచ్చే అవకాశం ఉంది. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లకు పూర్తి స్థాయిలో మార్పులు చేయడం అంత ఈజీ కాదు. కోరుకున్న ఆకృతిని తీసుకురావడం కోసం నిర్మాణాన్ని పూర్తిగా తొలగించడం ఇష్టం లేకపోయినా కాస్త కష్టం కూడా. అలాంటి వారి కోసం ఆధునిక పరిజ్ఞానం తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి అర్కిటెక్ట్ లు ముందుకొస్తున్నారు. పాత ఇంటిని తొలగించకుండా, బయట చిన్నచిన్న మార్పులు చేస్తూ అందంగా డిజైన్లు రూపొందిస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే పాత ఇళ్లు కొత్తగా కనిపిస్తుండడం యజమానులకు సంతృప్తినిస్తోంది.






