- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం బాటిళ్లకు నిలయంగా 'ఓయూ పైలాన్'.. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆగ్రహం!
ఉస్మానియా యూనివర్సిటీలోని శతాబ్ది పైలాన్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. సెక్యూరిటీ వైఫల్యంతో మద్యం బాటిళ్లు పేరుకుపోవడపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, సికింద్రాబాద్: విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం సుమారు రూ. 1.5 కోట్ల భారీ వ్యయంతో పైలాన్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పారిశుధ్య లోపం తో కునారిల్లుతున్నది. పైలాన్ పరిసరాల్లో ఎక్కడ చూసినా ఖాళీ బీరు బాటిళ్లు, మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో బయటి వ్యక్తులు యథేచ్ఛగా ఇక్కడ మద్యం సేవిస్తూ, తిని పడేసిన విస్తరాకులతో ఆ ప్రాంతమంతా దుర్గంధాన్ని వెదజల్లుతున్నది. చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన ఈ కట్టడం భద్రత కరువై అసాంఘిక చర్యలకు అడ్డాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.
నిర్లక్ష్యపు నీడలో ఓయూ సెక్యూరిటీ సిబ్బంది..
ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీ నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీలోని పలు ప్రదేశాలు తాగుబోతులకు అడ్డాగా మారాయి. చీకటి పడితే చాలు.. బీరు, బిర్యానీ తెచ్చుకొని పని కానిచ్చుకొని వెళ్లిపోతున్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. పవిత్రమైన దేవాలయం లాంటి ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ లో అసాంఘిక కార్యకలాపాలు నెలకొనడం సిగ్గుచేటు. క్యాంపస్ చుట్టూ ఇంత నిఘా, పటిష్టమైన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం సెక్యూరిటీ విభాగం పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనం అని విద్యార్థులు మండిపడుతున్నారు.
బయటి వ్యక్తుల ఆగడాలు..
బయటి వ్యక్తులు ధైర్యంగా మద్యం బాటిళ్లతో పైలాన్ వద్దకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారంటే, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే పవిత్రమైన విద్యా నిలయం తన గౌరవాన్ని కోల్పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణను విస్మరించిన అధికారులు..
పైలాన్ నిర్మాణ సమయంలో చూపిన ఉత్సాహం దాని మెయింటెనెన్స్‌లో అధికారులు చూపడం లేదు. పారిశుధ్య పనులను గాలికి వదిలేయడం వల్ల చుట్టూ చెత్తాచెదారం నిండిపోయింది. వర్సిటీ ప్రతిష్ఠను పెంచాల్సిన చిహ్నం, నేడు అధికారుల ఉదాసీనతతో మురికి కూపంగా మారడంపై పూర్వ విద్యార్థులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు నిద్రమత్తు వదిలి, సెక్యూరిటీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చారిత్రక చిహ్నాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.






