- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఫ్లోర్‌కు ‘‘లక్ష’’.. GHMC టౌన్ ప్లానింగ్‌లో యధేచ్చగా దందా నడిపిస్తోన్న లంచవతారులు!
దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అడ్డుకోవల్సిన అధికారులే వాటిని ఆసరాగా చేసుకుని దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదివరకు అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న పలువురు అధికారులను ఒక సర్కిల్ నుంచి మరో జోన్‌లోని సర్కిల్‌కు బదిలీ చేసినా, వారి పని తీరు మారటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా లంచాలకు ఆశపడి అడ్డదారిలో నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తయిన భవనాలకు పది శాతానికి మంచి డీవియేషన్స్ ఉన్నా, లక్షల రూపాయలను లంచాలుగా స్వీకరిస్తూ నిబంధనలకు విరుద్దంగా అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఇటీవలే కొందరు అధికారులకు స్థాన చలనం కల్గించగా, మరి కొందర్నీ తమ మాతృ శాఖకు సరెండర్ కూడా చేశారు.
అయినా వీరి పని తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం, ఒకవైపు అవినీతి విచారణలు ఎదుర్కొంటూనే మరో వైపు యధేచ్చగా అవినీతికి పాల్పడుతుండటంతో చేసేదేమీ లేక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే ఖైరతాబాద్ జోన్‌లో విధులు నిర్వర్తించిన ఓ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదులు అందటంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని శేరిలింగంపల్లి జోన్‌కు బదిలీ చేశారు. అయినా సదరు అధికారి తన పని తీరు, పద్దతిని మార్చుకోకుండా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించటం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. చిన్న చిన్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకుంటున్న వారిని టార్గెట్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెసిడెన్షియల్ భవనాలకు సంబంధించి ఒక్కో అంతస్తుకు లక్ష, అదే కమర్షియల్ భవనాలైతే ఒక్కో అంతస్తుకు రెండు నుంచి మూడు లక్షల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక భవన నిర్మాణ అనుమతి ఉండి, నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా దాదాపు 50 శాతం డీవీయేన్స్‌తో నిర్మితమైన భవనాలకు ఒక్కో అంతస్తుకు సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు డిమాండ్ చేస్త్తూ అడ్డదారిలో అక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇదే రకంగా ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలోని కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అక్రమ నిర్మాణాలకు అండ
అక్రమంగా నిర్మితమవుతున్న భవనాలకు సంబంధించి ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లిల్లోని కొందరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అండగా ఉంటున్నట్లు ఆరోపణలున్నాయి. తొలుత ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించుకునేందుకు మౌఖిక ఆదేశాలిస్తూ, ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందటంతో, వారు ప్రశ్నిస్తే, లీగల్‌గా ఎలా ముందుకెళ్లాలోనన్న విషయంపై భవన నిర్మాణదారుడికి సలహాలిస్తూ, ఈ వ్యవహారం కోర్టుకెక్కెందుకు కారకులవుతున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారుల అవినీతి కారణంగా ఇలాంటి వ్యవహారాల్లో జీహెచ్ఎంసీ లీగల్ సెల్‌కు, స్టాండింగ్ కౌన్సిల్‌కు అనవసరమైన పని కల్పిస్తున్నట్లు విమర్శలున్నాయి.
కార్పొరేటర్లతో కుమ్మక్కు
ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సికిందరాబాద్, ఖైరతాబాద్ జోన్లలో కొందరు టౌన్ ప్లానింగ్ ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు, చైన్ మెన్లు 40, 50, 60 గజాల్లో నిర్మిస్తున్న ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇళ్లు నిర్మించుకునే వారిని మామూలు అడిగితే ఎలక్షన్ సమయంలో వారి నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన కొందరు కార్పొరేటర్లు అధికారులతో కుమ్మక్కై చిన్న ప్లాట్ల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
మరి కొన్ని సంఘటనల్లో కార్పొరేటర్లే మధ్యవర్తిత్వం వహిస్తూ ప్లాటు యజమానుల నుంచి అధికారులకు మామూళ్లు ఇప్పిస్తూ, అందులో వాటాలుగా పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. 2020కి ముందు కార్వాన్ నియోజకవర్గంలోని ఓ డివిజన్ కార్పొరేటర్ ఇదే తరహాలో ప్రజలను దోచుకున్నట్లు సమాచారం. నల్లా కనెక్షన్ తీసుకున్న ఓ బస్తీలోని ఓ ఇంటి యజమాని నుంచి కేవలం రూ. 3 వేలు లంచంగా తీసుకుని, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఘటన బయటపడటంతో చివరకు ఆ కార్పొరేటర్ కాస్త మాజీ కార్పొరేటర్ అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.