గాంధీ ఆస్పత్రికి ఆధునిక వైద్య పరికరాలు అందజేసిన ఎన్‌టీపీసీ

by Jakkula.Mamatha |

సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా ఎన్‌టీపీసీ లిమిటెడ్ గాంధీ ఆస్పత్రికి ఆధునిక వైద్య పరికరాలను అందజేసింది.

గాంధీ ఆస్పత్రికి ఆధునిక వైద్య పరికరాలు అందజేసిన ఎన్‌టీపీసీ
X

దిశ, సికింద్రాబాద్: సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా ఎన్‌టీపీసీ లిమిటెడ్ గాంధీ ఆస్పత్రికి ఆధునిక వైద్య పరికరాలను అందజేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్పత్రి ఆర్థోపెడిక్స్ విభాగం, మార్చురీ సేవల అభివృద్ధి కోసం ఈ పరికరాలను సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్) & రీజినల్ హెడ్ (నార్త్ అండ్ సౌత్) సూర్యనారాయణ పాణిగ్రాహి పరికరాలను అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం సూర్యనారాయణ పాణిగ్రాహి మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాజ సంక్షేమ రంగాల్లో ప్రభావవంతమైన సీఎస్‌ఆర్ కార్యక్రమాలను కొనసాగించడం ఎన్‌టీపీసీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి సంస్థ కట్టుబడి ఉందని, కొత్త పరికరాలు రోగులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ ఎన్. వాణి మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రికి ఎన్‌టీపీసీ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరికరాల ద్వారా చికిత్స సేవల నాణ్యత మరింత పెరిగి, రోగులకు అధునాతన వైద్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి, ఎన్‌టీపీసీ దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story