- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సీతక్క
పాలనా కేంద్రాలను ప్రతి తల్లి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : పాలనా కేంద్రాలను ప్రతి తల్లి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని రక్షాపురం, అరుంధతి నగర్‌లలో శుక్రవారం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కమ్ క్రెచ్ కేంద్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తో కలిసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు మంత్రి కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన విద్యా విభాగాలు, పోషకాహార కార్నర్, ఆరోగ్య పర్యవేక్షణ విభాగం, విశ్రాంతి గది, చిన్నారుల ఆట స్థలాలు, అభ్యాస వనరులను పరిశీలించారు. క్రెచ్ సిబ్బంది నిర్వహిస్తున్న కార్యకలాపాలు, చిన్నారుల అభ్యాస కార్యక్రమాల ప్రదర్శనలను ఆమె తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎస్‌బీఐ ఫౌండేషన్ మద్దతుతో మొబైల్ క్రెచెస్ సంస్థ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న “ఎస్‌బీఐఎఫ్ ముస్కాన్ ప్రొవైడింగ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ త్రూ మోడల్ అంగన్‌వాడీ కమ్ క్రెచెస్” ప్రాజెక్టు కింద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రాంతాలు, శ్రామిక కుటుంబాలు, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు పాలన కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతల కారణంగా అనేక మంది మహిళలు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు సురక్షితమైన, నాణ్యమైన, అందుబాటులో ఉన్న శిశు సంరక్షణ సేవలను పాలన కేంద్రాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏడు నెలల వయస్సు నుండి...
ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలను పాలన కేంద్రాల్లో చేర్చుకోవచ్చని మంత్రి సీతక్క తెలిపారు. మూడు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత అదే పిల్లలు అంగన్‌వాడీ వ్యవస్థ ద్వారా నిరంతర విద్యా, అభివృద్ధి సేవలను పొందవచ్చని చెప్పారు. శిశువు జీవితంలోని తొలి వెయ్యి రోజులు శారీరక, మానసిక, మేధో వికాసానికి అత్యంత కీలకమని మంత్రి వివరించారు. ఈ దశలో పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ, ప్రేరణాత్మక అభ్యాసం, సమగ్ర సంరక్షణ అత్యంత అవసరమన్నారు. ప్రభుత్వంతో భాగస్వామ్యం చేస్తూ ఆదర్శ అంగన్‌వాడీ కమ్ క్రెచ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ ఫౌండేషన్, మొబైల్ క్రెచెస్ సంస్థలను మంత్రి అభినందించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అనుకూలంగా విద్యా సామగ్రి, బొమ్మలు, అభ్యాస వనరులు, శిశు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. పాలన కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని, అర్హులైన పిల్లలందరిని తప్పనిసరిగా నమోదు చేయించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు సుమారు రూ.61 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలను అందించిందని మంత్రి వెల్లడించారు. ఈ అవకాశాలను మహిళలు వ్యాపారాలు, స్వయం ఉపాధి, ఆదాయ వృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలని కోరారు.
హైదరాబాద్ జిల్లాలో మిషన్ శక్తి కింద మొబైల్ క్రెచెస్ సంస్థ సహకారంతో, ఎస్‌బీఐ ఫౌండేషన్ మద్దతుతో మొత్తం ఐదు పాలన అంగన్‌వాడీ కమ్ క్రెచ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నాయని, ఇవి అమీర్‌పేట్ సెక్టార్‌లోని బల్కంపేట్ 2, రెహ్మత్‌నగర్ సెక్టార్‌లోని ఆరోగ్యనగర్, సీతాఫల్‌మండి సెక్టార్‌లోని చిలకలగూడ, అడ్డగుట్ట సెక్టార్‌లోని ఏసీఎస్ నగర్, గౌలిపురా సెక్టార్‌లోని అరుంధతి నగర్ 2 ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు . ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాల పాటు పైలట్ ప్రాతిపదికన అమలుకానుందని, మొబైల్ క్రెచెస్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ కార్యక్రమం కొనసాగనుందని ఆమె వివరించారు. పథకం అమలులో భాగంగా ప్రతి క్రెచ్ వర్కర్‌కు నెలకు రూ.5,500, ప్రతి క్రెచ్ హెల్పర్‌కు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఐసీడీఎస్ నిబంధనల ప్రకారం సిబ్బంది నియామకాలు చేపట్టబడతాయని పేర్కొన్నారు. మంత్రి పర్యటనకు ముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా కేంద్రాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, కేంద్రంలో విద్యార్థుల సంఖ్య, మెనూ విధానం అమలు తదితర అంశాలపై తెలుసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో పాలన పథకం అమలుకు సంబంధించి జిల్లా సంక్షేమ అధికారికి సుమారు రూ.2,67,200 నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ప్రత్యుష్ మెహ్రోత్రా, ఎస్‌బీఐ ఫౌండేషన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజారామ్ చవాన్, మొబైల్ క్రెచెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరశ్రీ ఘోష్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జేడీ మోతి, అక్కేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.






